Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీ కమిషనర్ పై మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం ..ఎందుకంటే

By:  Tupaki Desk   |   15 Oct 2020 4:20 PM IST
జీహెచ్ ఎంసీ కమిషనర్ పై మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం ..ఎందుకంటే
X
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ ఎం సీ అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ వరదల నేపధ్యంలో హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. అయితే ఆయన ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్ళిన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి సందర్శన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు దూరంగా ఉండడం ఏమిటని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి, కనీసం డీఈ , ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సమంజసం కాదని, సంబంధిత అధికారులు ఒక్కరూ రాకపోతే తాను వివరాలు ఎలా తెలుసుకుంటానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు తన పర్యటనకు తహశీల్దార్ లు కూడా వచ్చే స్థాయి కూడా కాదా అని ఆయన నిలదీశారు. ఇక అనంతరం హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో ఫోన్ లో మాట్లాడిన మంత్రి, నీళ్లల్లో ఉన్న నివాసితులకు నిత్యావసరాలు, పాలు, ఆహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక ఆయన ఫోన్ తో కదిలిన జీహెచ్ ఎంసీ యంత్రాంగం ఆయన వెంట నడిచింది. జోనల్ కమిషనర్ ప్రవనిక,ఇతర అధికారులు ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలకి వెళ్లారు.

వాయుగుండం దెబ్బకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలు తెలంగాణ, ఏపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలపై ప్రభావం చూపాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగాయి. చెరువులు మత్తడి దుంకాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లన్నీ కాల్వల్లా మారిపోయాయి. వరదల్లో చిక్కుకుపోయి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు.24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారని అధికారులు చెబుతున్నారు. రోడ్లపైనే పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది.