Begin typing your search above and press return to search.

కవితకు కేంద్ర మంత్రి పదవి

By:  Tupaki Desk   |   15 Feb 2016 5:52 AM GMT
కవితకు కేంద్ర మంత్రి పదవి
X
ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరవుతున్నారా... కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్ ఎస్ చేరిక ఖాయమైందా... అదే నిజమైతే టీఆరెస్ కు ఎన్ని మంత్రిపదవులు దక్కనున్నాయి... ఎవరెవరికి ఆ పదవులు వరించనున్నాయి అన్న చర్చ టీఆరెస్ వర్గాల్లో జరుగుతోంది. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్ ఎస్ స్వతంత్రంగా ఎదగాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రతి పక్షాల్లోని బలమైన నేతలతో పాటు భారీ క్యాడర్ కలిగిన నాయకులను టీఆరెస్ లో కలుపుకొంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో ఎదగాలని కోరుకుంటున్నా అది వారికి సాధ్యపడడం లేదు. అంతేకాకుండా రోజురోజుకూ బీజేపీ గ్రాఫ్ అన్ని రాష్ట్రాల్లోనూ పడిపోతోంది. దీంతో ప్రాంతీయ పార్టీలపై బీజేపీ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం అక్కడ ప్రాంతీయ పార్టీల కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ తెలంగాణలోనూ అధికార టీఆరెస్ తో స్నేహానికి ఓకే అంటున్నట్లుగా సమాచారం.

2019 సాధారణ ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత ఎక్కువయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌ తో ఆ దిశగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీయేకు టీఆర్ ఎస్ అవసరం లేకున్నా... తెలంగాణలో అంచెలంచెలుగా ఎదుగుతున్న టీఆర్ ఎస్‌ ను చేర్చుకోవడం బీజేపీకే కలిసి వస్తుందని అభిప్రాయంతో వున్నారు. మోడీతో కేసీఆర్ 40 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశం కావడం వెనుక వున్న ఎత్తుగడ ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్డీయేలో టీఆరెస్ చేరితే ఒక కేబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవితో పాటు మరో స హాయ మంత్రి పదవి ఇచ్చేందుకు నరేంద్రమోడీ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే టీఆర్ ఎస్ నుంచి కేబినెట్ రేస్‌ లో ముగ్గురు ఎంపీలున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా సీఎం కేసీఆర్ కూతురు - నిజమాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కె.వినోద్‌ కుమార్ - మహబూబ్‌ నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌ రెడ్డిలు రేసులో ఉన్నారని పార్టీ వర్గాల అభిప్రాయం. ఈ ముగ్గురిలో ఇద్దరికి అవకావం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కవితతో పాటు వినోద్‌ కుమార్ ఈ అవకాశాలు దక్కుతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎంపి జితేందర్‌ రెడ్డి ఇప్పటికే పార్లమెంట్‌ లో ఆహార స్థాయి సంఘం కమిటీకి ఛైర్మన్‌ గా వున్నారు. ఈ పదవి దాదాపు కేబినెట్ మంత్రి పదవితో సమానం. దీంతో నిజమాబాద్ ఎంపి కవితకు కేబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి దక్కే అవకాశముండగా.. వినోద్‌కుమార్‌ కు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కూడా టీఆర్ ఎస్ ముఖ్యులున్నట్లు సమాచారం.