Begin typing your search above and press return to search.

నేనొస్తే.. కాసేపు కూర్చోలేరా?: మ‌హిళ‌ల‌పై ఏపీ మంత్రి ఫైర్‌!

By:  Tupaki Desk   |   2 Oct 2022 2:01 PM IST
నేనొస్తే.. కాసేపు కూర్చోలేరా?: మ‌హిళ‌ల‌పై ఏపీ మంత్రి ఫైర్‌!
X
త‌న దూకుడైన రాజ‌కీయంతో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దృష్టిలో ప‌డ్డారు.. కృష్ణా జిల్లా పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌. ఈ దూకుడే క‌ల‌సి వ‌చ్చి జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రిగా చాన్సు కొట్టేశారు. ప్ర‌స్తుతం ఏపీ గృహ‌నిర్మాణ శాఖ మంత్రిగా జోగి ర‌మేష్ ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌రోమారు ఈ దూకుడుతోనే జోగి ర‌మేష్ ఇబ్బందుల్లో ప‌డ్డార‌ని అంటున్నారు.

ఇటీవ‌ల వైఎస్సార్ చేయూత సొమ్మును చిత్తూరు జిల్లా కుప్పంలో ల‌బ్ధిదారులైన మ‌హిళ‌ల ఖాతాలో సీఎం జ‌గ‌న్ జ‌మ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా వైఎస్సార్ చేయూత వారోత్స‌వ సంబ‌రాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో పెడ‌నలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మంత్రి జోగి ర‌మేష్ పాల్గొన్నారు. ల‌బ్ధిదారుల‌కు వైఎస్సార్ చేయూత ప‌థ‌కం చెక్కును అంద‌జేశారు. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేయూత ద్వారా ల‌బ్ధి పొందిన 1906 మంది మ‌హిళ‌ల‌ను పెడ‌నకు తీసుకొచ్చారు.

అయితే మంత్రి జోగి ర‌మేష్ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించ‌గానే కొంత‌మంది మ‌హిళ‌లు వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. దీంతో వారిపై మంత్రి జోగి ర‌మేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ కోసం నేనొస్తే మీరు కూర్చోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నారా?... ఏమ్మా కాసేపు కూర్చోలేరా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అక్క‌డే ఉన్న మ‌రో మ‌హిళ‌ను ఉద్దేశించి.. అక్కా.. ఆ న‌లుగురి పేర్లు రాసుకోండి.. వారు ఏ వార్డు వారో తెలుసుకోండి.. ఏమ్మా ప‌ది నిమిషాలు కూర్చోలేక‌పోతున్నారా.. మీ కోస‌మే క‌దా ఇదంతా చేసేది అంటూ మంత్రి జోగి ర‌మేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మైన ఆ న‌లుగురి మ‌హిళ‌ల పేర్లు రాసుకోండి అంటూ స‌భా ప్రాంగ‌ణంలోనే ఉన్న స‌చివాల‌య సిబ్బందికి మంత్రి హుకుం జారీ చేశారు.

దీంతో స‌చివాల‌య సిబ్బంది ఆ న‌లుగురు మ‌హిళ‌ల వివ‌రాలు క‌నుక్కునే ప‌నిలో ప‌డ్డారు. అయితే మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ ఆ న‌లుగురు అప్ప‌టికే అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డం విశేషం. కాగా ఆ న‌లుగురు మ‌హిళ‌ల‌ది పెడ‌న కాద‌ని అధికారులు నిర్ధారించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు స‌చివాల‌య సిబ్బంది పెడ‌న మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు స‌మాచారం అందించారు.

ఇప్పుడు జోగి ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. కాగా స‌భ నిర్వ‌హించిన స‌మ‌యంలోనే పెడనలో భారీ వ‌ర్షం ప‌డింది. దీంతో లబ్ధిదారులు స‌భ‌కు చేరుకోవ‌డం ఆల‌స్య‌మైంది. కొంత‌మంది వ‌ర్షంతో రాలేక‌పోయారు. దీంతో వ‌లంటీర్లు, సచివాల‌యాల సిబ్బంది, ఇతర అధికారులు రోడ్డుపై వెళ్తున్న మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి బ‌ల‌వంతంగా కూర్చోబెట్టార‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత వ‌ర్షం త‌గ్గ‌డంతో ల‌బ్ధిదారులు కూడా భారీగా త‌ర‌లివచ్చారు.

మ‌రోవైపు మ‌హిళ‌లు మంత్రి జోగి ర‌మేష్ వ్యాఖ్య‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ల ఇబ్బందులు తెలుసుకోకుండా మంత్రి ఇలా త‌మ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఏమిట‌న్నారు. తాము ఏ కార‌ణంతో బ‌య‌ట‌కు వెళ్తున్నామో తెలుసుకోకుండా ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని వాపోయారు.