Begin typing your search above and press return to search.

అలా చేస్తే ప‌న్నీర్‌ ను అమ్మ ఆత్మ క్ష‌మించ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   3 Jun 2017 6:32 AM GMT
అలా చేస్తే ప‌న్నీర్‌ ను అమ్మ ఆత్మ క్ష‌మించ‌ద‌ట‌
X
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌కు - అన్నాడీఎంకే నేత‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎన్నికల కమిషన్‌ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అన్నా డీఎంకే నేత - శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ కు బెయిల్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. బెయిల్ దొరికిన అనంత‌రం రాష్ర్టానికి వ‌చ్చిన దిన‌క‌ర‌న్‌ ను క‌లిసేందుకు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోని మంత్రులు ఆస‌క్తి చూపించ‌డం లేదు. అంతేకాకుండా తాము దిన‌క‌ర‌న్‌ ను క‌ల‌వ‌బోమ‌ని అధికారికంగా ప్ర‌క‌టించేశారు. ముఖ్య నేత‌గా ఉన్న‌ రాష్ట్ర మత్స్య - ఆర్థికశాఖ మంత్రి డి.జయకుమార్ ఈ విష‌యం స్వ‌యంగా, బ‌హిరంగంగా స్పష్టం చేశారు.

చెన్నై రాయపురంలోని ఓ కల్యాణమండపంలో జరిగిన ‘అమ్మ’ పథక శిబిరంలో మంత్రి జయకుమార్‌ పాల్గొని 227 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విలేకరులతో జ‌య‌కుమార్ మాట్లాడుతూ బెయిల్‌ పై టీటీవీ దినకరన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయనను అన్నాడీఎంకే (అమ్మ) నిర్వాహకులు, కార్యకర్తలు కలవరని స్ప‌ష్టం చేశారు. తమ వైఖరిలో మార్పు రాదని తెలిపారు. ముఖ్య‌మంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం పని చేయనుందని, తమ వెనుక సూత్రధారులెవరూ లేరని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో త్వరలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మాజీ ముఖ్య‌మంత్రి ఓ.పన్నీర్‌ సెల్వంపై జ‌య‌కుమార్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడి మేరకు పన్నీర్‌ వర్గంతో కలిసి పని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని అందుకే ...ప‌న్నీర్ వర్గంతో చర్చలకు తాము సదా సిద్ధంగా ఉన్నామని, వాళ్లు ఎప్పుడు వచ్చినా చర్చలకు సిద్ధమేనని తెలిపారు. త్వరలో శాసనసభకు ఎన్నికలు వస్తాయని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించ‌డంపై జ‌య‌కుమార్ మండిప‌డ్డారు. ప్ర‌స్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం రద్దు కావాలనే ఉద్దేశంతో సెల్వం చెప్పినట్లయితే ఆయనను ‘అమ్మ’ ఆత్మ క్షమించదని హెచ్చ‌రించారు. అయితే త‌న‌ వర్గంలో పదవుల్లో లేనివారిని శాంతింపచేయడానికి పన్నీర్‌సెల్వం సాధారణ ఎన్నికల విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. 2021లోనే మళ్లీ ఎన్నికలు వస్తాయని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం సాధారణ ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకోవడంలేదని, దానిని పార్టీ కార్యకర్తలూ ఇష్టపడటంలేదని తెలిపారు. పన్నీర్‌ వర్గంలో లుకలుకలు బయలుదేరాయని, ఆ వర్గంలోని పలువురు మళ్లీ తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని జ‌య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/