Begin typing your search above and press return to search.

9951314101 నెంబ‌ర్ ఏపీ మంత్రి ఎందుకిచ్చారు?

By:  Tupaki Desk   |   7 July 2017 5:54 AM GMT
9951314101 నెంబ‌ర్ ఏపీ మంత్రి ఎందుకిచ్చారు?
X
ప‌వ‌ర్ లేన‌ప్పుడు హామీలు ఇవ్వ‌టం.. వ‌చ్చాక ఆ హామీల‌కు తూట్లు పొడుస్తూ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల‌వాటే. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తులు ఇచ్చేశార‌ని.. త‌న‌కు కానీ ప‌వ‌ర్ చేతికి వ‌స్తే ఆ ప‌రిస్థితిని మార్చేస్తాన‌ని బాబు బీరాలు ప‌లికేవారు.

ఏపీలో బాబు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయిన నేప‌థ్యంలో.. తాజా ప‌రిస్థితి చూస్తే నోటి వెంట మాట రాని దుస్థితి. రోడ్ల ప‌క్క‌న ఉన్న మ‌ద్యం షాపుల కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని సుప్రీం అభిప్రాయం వ్య‌క్తం చేస్తూ.. అలాంటి షాపుల‌కు లైసెన్స్ లు ర‌ద్దు చేయాల‌ని చెబితే.. మ‌ద్యం షాపుల్ని కంటిన్యూ చేసేందుకు వీలుగా ఆయా రోడ్ల‌నే ర‌ద్దు చేస్తామ‌ని చెబుతున్నారు ఏపీ ఎక్సైజ్ మంత్రి జ‌వ‌హ‌ర్‌.

మ‌ద్యంతో వ‌చ్చే ఆదాయాన్ని అంత‌కంత‌కూ పెంచుకొని.. రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాల‌ని త‌పించే ముఖ్య‌మంత్రుల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక‌రు. మ‌ద్యం షాపుల‌పై సుప్రీం తాజాగా విధించిన ప‌రిమితుల‌తో పెద్ద ఎత్తున మ‌ద్యం షాపుల‌కు ఇచ్చిన అనుమ‌తుల్ని ర‌ద్దు చేయాల్సిన ప‌రిస్థితి.

జాతీయ ర‌హ‌దారుల‌కు 500 మీట‌ర్లు.. రాష్ట్ర ర‌హ‌దారుల‌కు 200 మీట‌ర్ల లోపు ఎక్క‌డా మ‌ద్యం దుకాణాలు ఉండ‌రాద‌ని.. ఇలాంటి వాటి లైసెన్సులు ర‌ద్దు చేయాల‌ని అన్ని రాష్ట్రాల‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల్ని తూట్లు పొడిచేలా.. రోడ్ల‌ను ర‌ద్దు చేస్తామంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఏపీ మంత్రివ‌ర్యులు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో ఏపీకి చెందిన ప‌లు జిల్లాల్లో జ‌నావాసాల మ‌ధ్య ఉండే మ‌ద్యం షాపుల‌పై స్థానిక మ‌హిళ‌లు క‌న్నెర్ర చేస్తున్నారు. త‌మ కాపురాల్లో నిప్పులు పోస్తున్న మ‌ద్యం షాపుల‌పై మండిప‌డుతున్నారు. ప‌లుచోట్ల ఇళ్ల మ‌ధ్య ఉండే మ‌ద్యం షాపుల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. ఈ తీరుపై ఏపీ ఎక్సైజ్ మంత్రి జ‌వ‌హార్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇళ్ల మ‌ధ్య‌న లిక్క‌ర్ షాపుల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు రోడ్ల మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న చేయాల్సిన అవ‌స‌రం లేదని.. సింఫుల్ గా 9951314101 నెంబ‌రుకు ఫోన్ చేస్తే.. అలాంటి షాపుల మీద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. మ‌ద్యం షాపుల కోసం రోడ్ల‌నే ర‌ద్దు చేస్తామ‌ని చెప్పే మంత్రివ‌ర్యులు.. జ‌నావాసాల మ‌ధ్య‌న ఉండే ఇళ్ల మీద చ‌ర్య‌లు తీసుకుంటారా? అన్న‌ది ఇప్పుడు అంద‌రిని తొలిచేస్తున్న సందేహంగా చెప్ప‌క త‌ప్ప‌దు.