Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎంను కెలుకుతున్న ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   9 July 2017 6:19 AM GMT
తెలంగాణ సీఎంను కెలుకుతున్న ఏపీ మంత్రి
X
కాపు రిజ‌ర్వేష‌న్ల పోరాట‌స‌మితి నాయకుడు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం - మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు మంద కృష్ణమాదిగ - ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై ఏపీ మంత్రులు ఎదురుదాడి ప్రారంభించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్ మ‌రో అడుగు ముందుకు వేసి పొరుగున ఉన్న తెలంగాణ స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేశారు. మాదిగల కురుక్షేత్ర మహాసభను రణక్షేత్రంగా మార్చి ఆందోళనలు చేయించడం సరైంది కాదని మంత్రి జ‌వ‌హార్ అన్నారు. ఉద్యమాల పేరుతో దళిత యువకులను మోసం చేస్తున్న మంద కృష్ణమాదిగపై ఆయ‌న‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా దళిత యువత తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు.

వైసీపీ అధినేత జగన్ దర్శకత్వంలో ముద్రగడ పద్మనాభం - మంద కృష్ణ మాదిగ పనిచేస్తున్నారని మంత్రి జ‌వ‌హ‌ర్‌ విమర్శించారు. మాదిగ సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై మంద‌కృష్ణ‌కు చిత్తశుద్ధి ఉంటే గుంటూరులో జరిగే వైసీపీ ప్లీనరీని అడ్డుకుని వర్గీకరణపై జగన్ వైఖరి తెలుసుకోవాలన్నారు. 1983 నుంచి మాదిగలంతా తెదేపా వెంట ఉండటంతో తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి దిగుమతి నాయకత్వం అవసరం లేదన్నారు. మంద‌కృష్ణ మాదిగ సొంత రాష్ట్రమైన తెలంగాణా గురించి ముందుగా ఆయ‌న ఆలోచించుకోవాల‌ని మంత్రి సూచించారు. ఆ రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు ప్రాధాన్యం ఇప్పిస్తే మందకృష్ణ నాయకత్వానికి మద్దతు తెలిపేవారమని జవహర్ వ్యాఖ్యానించారు. త‌ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఏపీ మంత్రి ఇర‌కాటంలో ప‌డేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు - భరోసా - అండ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. రాజన్న రాజ్యం పేరుతో రాష్ట్రాన్ని దోచుకునేందుకు అధికారంలోకి వస్తామన్న వైసీపీ నాయకుల కలలు పగటి కలలుగా మిగిలిపోతాయని ఆయ‌న జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల అనంతరం తల్లీ - పిల్ల కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోతాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లేందుకే వైసీపీ ప్లీనరీ పెట్టినట్లుందని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎరుపు వర్ణం సంతరించుకున్న కృష్ణా - గోదావరి సంగమ జలాలే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. వైసీపీ - కాంగ్రెస్ నాయకులు ఆ నీటిలో మునిగి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు.

విభజన నేపధ్యంలో రాష్ట్ర అభివృద్ధిపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తూ ప్రతి పనికి అడ్డు తగులుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శిద్ధా రాఘ‌వ‌రావు ఆరోపించారు. ఎంపరర్ ఆఫ్ క్రైమ్స్ - ఎంపరర్ ఆఫ్ లైస్ - ఎంపరర్ ఆఫ్ స్కామ్స్ - ఎంపరర్ ఆఫ్ చీటర్స్ వైసీపీ నేతలేనన్న విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ ప్రవర్తనతో వైకాపా ఇప్పటికే సగం ఖాళీ అయిందని భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. జగన్ 13 కేసుల్లో ముద్దాయి అని ఆరోపించారు.