Begin typing your search above and press return to search.

మంత్రి హరీశ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:15 AM IST
మంత్రి హరీశ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?
X
ఫైర్ బ్రాండ్ కమ్ టాస్క్ మాస్టర్ అయిన మంత్రి హరీశ్ రావు ఏంటి.. క్రికెట్ ఏమిటంటారా? తనలోని క్రికెటర్ యాంగిల్ చూపించి అందరి చేత వావ్ అనిపించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఆయన తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా వ్యవహరించిన హరీశ్ రావు.. తాజాగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ లో ఆడారు. ఇప్పటివరకు రాజకీయ నేతగా మాత్రమే చూసిన చాలామందికి హరీశ్ లోని ఆటగాడిని చూపించారు. క్రికెటర్ గా అదరగొట్టేసిన హరీశ్.. అందరిని వావ్ అనేలా వ్యవహరించారని చెప్పాలి. ఇంతకీ మంత్రి హరీశ్ ఎందుకు క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు?అన్న విషయంలోకి వెళితే..

సిద్దిపేట జిల్లా క్రికెటర్ అసోసియేషన్ వర్సెస్ హైదరాబాద్ కు చెందిన మెడికవర్ ఆసుపత్రి జట్ల మధ్య బుధవారం రాత్రి సిద్దిపేటలో ఫ్రెండ్లీ ట్వంటీ 20 మ్యాచ్ నిర్వహించారు. ఇందుకు సిద్దిపేట మినీ స్టేడియం వేదికగా మారింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సిద్దిపేట జట్ట నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి హరీశ్ తాను ఎదుర్కొన్న 12 బంతుల్లో మూడు ఫోర్లు బాది మొత్తం 18 పరుగులు చేశారు.

క్రీజ్ లో ఉన్నంతసేపు దూకుడుగా బ్యాటింగ్ చేసిన హరీశ్.. తన జట్టులోని ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. ఆయన బ్యాటింగ్ చేస్తున్నంతసేపు.. ప్రొఫెషనల్ ఆటగాడిగా కనిపించటం గమనార్హం. సిద్దిపేట విసిరిన సవాలును స్వీకరించిన మెడికవర్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. 19.5 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమైంది. విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించినా.. చివరకు సిద్దిపేట జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్ లో మరో ప్రత్యేకత ఏమిటో తెలుసా? సిద్దిపేట జట్టులో పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ ను సిద్దిపేట ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు.