Begin typing your search above and press return to search.

ఆ మాత్రం ఆవేశం ఉండాలి మంత్రిగారూ...

By:  Tupaki Desk   |   11 Nov 2022 6:06 PM IST
ఆ మాత్రం ఆవేశం ఉండాలి మంత్రిగారూ...
X
జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతూంటే వైసీపీ నేతలు మాత్రం ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఏపీ బీజేపీ నాయకుల తీరు సరిగ్గా ఉంటే ఈపాటికి మోడీ తో పవన్ ఇలాంటి భేటీలు ఎన్నో వేసేవారు. అయితే బీజేపీలో జనసేన పొత్తు మీద ఎవరి ఆలోచనలు వారివి. దాంతో పవన్ తన దారి తాను చూసుకున్నారు.

విషయం తెలిసిన బీజేపీ హై కమాండ్ రంగంలోకి దిగింది. అందుకే మోడీతో నేరుగా పవన్ భేటీకి రంగం సిద్ధం అయింది. ఈ మేరకు ప్రధాని ఆఫీసు ఈ అపాయింట్మెంట్ ని ఖరారు చేసింది. దాంతో పవన్ మోడీని కలుస్తున్నారు. అయితే దీని మీద వైసీపీకి గుర్రుగానే ఉంటుంది. భీమవరంలో అమలు చేసినట్లుగా వన్ సైడ్ షోగా విశాఖలో ప్రధాని టూర్ ని చేద్దామనుకుంటే కుదిరింది కాదు.

దానికి తోడు బీజేపీ నాయకులు కూడా విశాఖలో ఎంతో కొంత హల్ చల్ చేస్తున్నారు. ఇపుడు జనసేనానిని కూడా కలుపుకుంటున్నారు. దాంతో ఏమి జరుగుతుందో ఏమో అన్న కంగారు వైసీపీలో ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి గుడివాడ గురునాధరావు పవన్ ఎవరితో భేటీ అయితే మాకేంటి మేము అసలు పట్టించుకోమని అంటూనే పవన్ మీద నిప్పులు చెరిగారు.

పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఆయన పర్మనెంట్ పార్టీ మాత్రం టీడీపీయే అని గుడివాడ తన అక్కసు వెళ్లగక్కారని అంటున్నారు. పవన్ ఎపుడు ఎవరితో కలవాలి. ఎవరితో భేటీలు వేయాలి అన్నది టీడీపీయే చూస్తుంది అని గుడివాడ చెప్పుకొక్కయారు. పవన్ ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తులు కలిపారని, మళ్లీ ఇపుడు బీజేపీ వైపు వచ్చారని ఆయన ఏమి చేసినా చంద్రబాబు కోసమే అని గుడివాడ విసుర్లు విసిరారు.

అందుకేనా పవన్ని ప్యాకేజీ స్టార్ నేటి అని గుడివాడ అంటున్నారు. ఆయన ఎన్ని చెప్పులు చూపించినా తాము చెప్పాల్సింది చెబుతాం, అనాల్సింది అంటామని కూడా గుడివాడ క్లారిటీ ఇచ్చేసారు.

సొంత ఆలోచనలు మానేసి టీడీపీ మేలు కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ బీజేపీల మధ్య మాటామంతీలు ఎన్ని జరిగినా ఒరిగేది కరిగేది ఏమీ లేదని గుడివాడ అంటున్నారు. అంతే కాదు రెండు పార్టీలకు ఓట్లూ సీట్లూ లేవని కూడా వెటకారం చేశారు.

పవన్ కళ్యాణ్ కి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం అంటే అందులో టీడీపీని కూడా చేర్చాలన్నది పవన్ ఉద్దేశ్యమని ఆయన అంటున్నారు. ఎన్ని పార్టీలు కలసివచ్చినా ఎవరు ఎన్ని రకాలుగా ఎత్తులు వేసినా ఏపీలో మళ్ళీ గెలిచేది వైసీపీయేనని పాత పాట పాడేశారు మంత్రిగారు.

అంతే కాదు ఏపీలో 175కి 175 సీట్లు తాము గెలుచుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ మోడీని కలుస్తూంటే గుడివాడ ఎందుకో తెగ ఆవేశపడుతున్నారు. ఆ మాత్రం అక్కసు ఆవేశం ఉండాలిలే మంత్రి గారు అంటున్నారు రాజకీయ ప్రత్యర్ధులు మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.