Begin typing your search above and press return to search.

కేజీ చికెన్ రూ.20.. మస్తుగా తినమంటున్న మంత్రి

By:  Tupaki Desk   |   13 March 2020 6:30 AM GMT
కేజీ చికెన్ రూ.20.. మస్తుగా తినమంటున్న మంత్రి
X
ఎవరి బాధ వారిది. వ్యక్తిగతంగా బాధ వచ్చి పడితే.. ఎంత దాచుకున్నా దాగదు. మాటల మధ్యలో వచ్చేస్తుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పరిస్థితి అలానే ఉంది. ఉద్యమకారుడిగా.. రాజకీయ నేతగా సుపరిచితుడైన ఆయన పె..ద్ద ఫౌల్టీ బిజినెస్ మ్యాన్. ఆ విషయం పెద్దగా బయటకు రాకుండా.. భారీఎత్తున ప్రచారం జరగకుండా ఉండటం ఈటెలకు మాత్రమే సాధ్యమైన అంశంగా చెప్పాలి.

ఊహించని రీతిలో కరోనా కారణంగా ఫౌల్ట్రీ పరిశ్రమ ఎంతలా ఎఫెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైరస్ కారణంగా కరోనా వ్యాప్తి చెందటం ఒక ఎత్తు అయితే.. మాంసాహారాన్ని తినటం ద్వారా కరోనా ప్రమాదం పొంచి ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. అందులో ఎలాంటి నిజం లేకున్నా.. నాన్ వెజ్ తిని కరోనాను తెచ్చుకునే కంటే.. నాలుగు రోజులు ఆగితే పోయేదేముందని.. నాన్ వెజ్ ప్రియులు సైతం దాన్ని ముట్టుకునేందుకు ఇష్టపడటం లేదు.

దీంతో.. కోళ్ల పరిశ్రమకు వాటిల్లుతున్న నష్టం అలా ఇలా లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కేజీ చికెన్ రూ.20లకే లభిస్తోంది. ఇలాంటివేళ.. వీలైనంత ఎక్కువగా చికెన్ తినాలంటూ కనిపించిన వారందరికి చెప్పటమే కాదు.. తాను ఏ వేదిక మీద నుంచైనా చికెన్ తినాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు మంత్రి ఈటెల. మిగిలిన తెలంగాణ మంత్రుల నోటి నుంచి రాని చికెన్ ప్రస్తావన.. ఈటెల వారి నోటి నుంచే ఎందుకంటే.. ఆయనగారికి ఉన్న కోళ్ల వ్యాపారమే కారణంగా చెబుతున్నారు.

ఇలా విమర్శించటంలో అర్థం లేదన్న వాదనా వినిపిస్తోంది. ఫౌల్ట్రీ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న వేళ.. ఈటెలకు ఆ రంగంలోని వారికి కష్టనష్టాలు బాగా తెలీయటం వల్లనే ఆయన అదే పనిగా ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా కరోనా కారణంగా తాను చేస్తున్న కోళ్ల వ్యాపారంలో తాను అప్పటివరకూ ఏడెనిమిది కోట్ల మేర నష్టపోయిన వైనాన్ని చెప్పారు. తాజాగా.. చికెన్ ఎంతైనా తినాలని కోరుతున్నారు. కేజీ రూ.20కే దొరుకుతున్న వేళ.. చికెన్ మస్తుగా తినాలంటున్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఎవరికి వారికి మనసులో ఉన్న గుబులును అధిగమించి మరీ చౌకగా మారిన చికెన్ తింటారా? అన్నది క్వశ్చన్.