Begin typing your search above and press return to search.

పెరుగుట విరుగుట కొరకే.. మంత్రి ఈటెల నోట మరో ఆసక్తికర వ్యాఖ్య

By:  Tupaki Desk   |   20 April 2021 4:02 AM GMT
పెరుగుట విరుగుట కొరకే.. మంత్రి ఈటెల నోట మరో ఆసక్తికర వ్యాఖ్య
X
మనసులోని మాటల్ని దాచటం కష్టం. అందునా.. మంత్రి ఈటెల రాజేందర్ లాంటి భావోద్వేగ రాజకీయ నాయకుడికి కాస్త కష్టమే. చాలామంది మంత్రులతో పోలిస్తే.. ఈటెల కమిట్ మెంట్ ను మెచ్చుకోవాల్సిందే. తెలంగాణ అధికారపక్షంలో ఉన్న చాలామంది నేతల మాదిరి.. నెల వారీగా టార్గెట్ పెట్టుకొని మరీ కోట్లాది రూపాయిల్ని వెనకేసే మైండ్ సెట్ ఆయనలో కనిపించదు. దీనికి తోడు.. తెలంగాణపై ఆయనకున్న కమిట్ మెంట్ మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వేచ్ఛగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేందుకు తపిస్తారు.

ప్రాంతీయ పార్టీలకు ఉండే పరిమితులు.. అందునా కేసీఆర్ లాంటి అధినేత ఉన్న వేళలో.. నిష్ఠూరంగా ఉండే నిజాన్ని చెప్పేందుకు చాలా దమ్ము అవసరం. మిగిలిన వారంతా మనకెందుకు? అన్నట్లు మౌనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడుప్పుడు ఓపెన్ అయిపోతుంటారు ఈటెల. తాజాగా ఆయన మరోసారి అలాంటి తీరునే ప్రదర్శించారు. గడిచిన కొంతకాలంగా అధినేత మీద అలకగా ఉన్నట్లు చెబుతారు. ప్రశ్నించేలా? లోగుట్టు సందేశాన్ని ఇచ్చేలా ఆయన మాటలు ఉండటం.. ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది

తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశానికి హాజరైన ఈటెల నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ఈసారీ నర్మగర్భంగా మాట్లాడిన ఆయన మాటలు గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చగా మార్చింది. ఇంతకీ ఆయన అన్న మాటేమిటంటే.. రాజకీయాలపై.. నాయకులపై ప్రజలకు రాన్రాను నమ్మకం పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు ప్రజలకు అపారమైన విశ్వాసం ఉండేదని.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్న ఆయన.. చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో మసిబూసి మారేడుకాయ చేస్తుందని.. ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. ‘గతంలో రాజకీయ నేతలంటే సమాజంలో ఒక గొప్ప గౌరవం.. విలువలు..విశ్వాసం ఉండేవి. రానురాను నాయకుల మీద.. రాజకీయా లమీద ఎలాంటి భావన వస్తుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మంచి సంప్రదాయమైతే కాదు. తాత్కాలిక గెలుపు కోసం.. తాత్కాలిక ప్రయోజనాల కోసం సంప్రదాయాల్ని.. మర్యాదాల్ని.. గౌరవాల్ని ఫణంగా పెట్టే పరిస్థితి రావొద్దు. వాస్తవానికి రాజకీయ నేతలు ఎప్పుడూ కూడా సమాజ శ్రేయస్సు కోసం పని చేసేవారే తప్ప.. ఇబ్బంది పెట్టటం కోసమో.. సొంత ప్రయోజనాల కోసం ఆశించే వాళ్లు కాదు. అలా చిత్రీకరించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది’’ అని వాపోయారు.

నేతలు.. ప్రజల మధ్య ఉండే సంబంధాల్లో చోటు చేసుకుంటున్న బాధాకరమైన సన్నివేశాల్ని ఇప్పుడు చూస్తున్నామన్న ఆయన.. ‘ఏదో ఒకనాడు పెరుగుట విరుగుట కోసమే అన్నట్లుగా ఇట్లాటివన్నీ పెరుగుతున్నాయి. మళ్లీ ఎక్కడో తప్పకుండా విరుగుతాయన్న నమ్మకం ఉంది. అంతిమంగా రాజకీయాలు.. రాజకీయ నేతల పట్ల గౌరవం పెంచుకునేలా ప్రజల్ని మనం డ్రైవ్ చేయాలి’ అని ఈటెల పేర్కొనటం గమనార్హం. మంత్రి నోటి నుంచి వచ్చిన మాటల్లో ‘పెరుగుట విరుగుట కొరకై’ మాటను అండర్ లైన్ చేసి చదువుకోవాలన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.