Begin typing your search above and press return to search.

కనిపించే దేవుడి కోసం కనిపించని దేవుడితో పెట్టుకోవాలా బుగ్గన

By:  Tupaki Desk   |   19 Feb 2020 10:40 AM IST
కనిపించే దేవుడి కోసం కనిపించని దేవుడితో పెట్టుకోవాలా బుగ్గన
X
మట్టిలో మాణిక్యాలంటారు కదా? ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన ఆ బ్యాచే. కొన్నిసార్లు ఎంత ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించదు. అలా అని నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తే.. రావాల్సిన పేరు కాస్త ఆలస్యంగా అయినా వచ్చేస్తుంది. ఏపీ మంత్రి బుగ్గన సరిగ్గా ఈ బ్యాచ్ కు చెందినోడే. మాటకు మాట.. విషయానికి విషయం.. పనికి పని చేసే నేతలు కొద్దిమందే. అన్ని కాంబినేషన్లు అందరిలో ఉండవు. కానీ.. బుగ్గన దీనికి మినహాయింపు. అందుకే కాస్త ఆలస్యంగా అయినా ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు జగన్ పుణ్యమా అని వచ్చాయని చెప్పాలి.

కీలక పదవుల్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటి విషయంలో కాస్త ముందు జాగ్రత్త చాలా అవసరం. కంటి ముందు కనిపించే అధినాయకుడి కోసం.. కంటికి కనిపించని దేవుడితో పెట్టుకోవటం ఏ మాత్రం మంచిది కాదు. కర్నూలు జిల్లా పర్యటన కు వచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల వేళ స్వామివారికి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల్ని సమర్పించాల్సి ఉంది.

ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి బుగ్గన పట్టువస్త్రాలు సమర్పిస్తారన్న సమాచారాన్ని దేవస్థానానికి ఇచ్చారు. మంత్రి వారు వస్తామంటే.. వెయిట్ చేయాల్సిందే కదా? అందుకే.. ఆయన కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. మంత్రివర్యులేమో.. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కు రావటం తో ఆయన ఆ కార్యక్రమంలో బిజీగా ఉండిపోయారు. సీఎం వారిని పంపించి.. బుగ్గనవారు శ్రీశైలం చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత పట్టువస్త్రాల్ని సమర్పించిన తర్వాత కార్యక్రమాన్ని షురూ చేశారు. ఎంత మంత్రి అయితే మాత్రం.. దేవుడి కార్యక్రమానికి ఇంతగా వెయిట్ చేయిస్తారా? అన్న ఆగ్రహం భక్తుల్లో వ్యక్తమవుతోంది. కంటి ముందుకు వచ్చిన అధినేత కోసం లక్షలాది మంది భక్తుల సెంటిమెంట్లను దెబ్బ తీయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. కాస్త చూసుకోండి బుగ్గనవారు.