Begin typing your search above and press return to search.

ఈ కాళ్ళ మొక్కుడు ఏంది మినిష్టర్ సార్లూ...?

By:  Tupaki Desk   |   7 May 2022 5:12 AM GMT
ఈ కాళ్ళ మొక్కుడు ఏంది మినిష్టర్ సార్లూ...?
X
దండం పెట్టడం మన సంప్రదాయం. ఎవరైనా ఎదురుపడితే రెండు చేతులూ జోడిస్తారు. ఇలా నమస్కారం చేయడంలోనే ఎంతో మర్యాద ఉంది. అయితే అది చాలదు అనుకుంటే సాష్టాంగాలు, పొర్లు దండాలు, కాళ్ళ మొక్కులు ఇవి కూడా ఉన్నాయి. సాధారణంగా ఏ ఆధ్యాత్మికవేత్తలకో, మహాత్ములు ఎదురుపడినపుడో ఆ భక్తి భావాలు పొంగి పొర్లి సాష్టాంగం పడేలా చేస్తుంది. అయితే అలాంటివి అరుదుగా జరుగుతాయి.

ఇక రాజకీయాలు అన్నవి ఒక సమాజ సేవ. ఇక్కడ ఎక్కువ తక్కువ కాకుండా అందరూ జనసేవలో తరిస్తూంటారు. అలా చూసుకున్నపుడు మర్యాదగా నమస్కారం చేసుకోవడం వరకూ ఒకే కానీ కాళ్లకు మొక్కడాలు, సాష్టాంగాలు పడడాలు అన్నవి ఎబ్బెట్టుగా తోస్తాయి.

ఈ రాజకీయ సాష్టాంగాలకు ఒక ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే అప్పట్లో ఎన్టీయార్ సీఎం గా ఉండేవారు. ఆయన సినీ రంగంలో రాముడు, క్రిష్ణుడు వంటి పాత్రలు పోషించి దైవాంశ సంభూతినిగా తనను తాను ఆవిష్కరించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఎన్టీయార్ ని చూసిన నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అంతా కలసి ఏకంగా సాష్టాంగాలు చేస్తూ వచ్చేవారు.

అన్న గారూ మీరే మా దేవుడు అంటూ స్తోత్రపాఠాలు వల్లెవేసేవారు. అయితే ఆనాడు ఎమ్మెల్యేలు, మంత్రుల సగటు వయసు గట్టిగా మూడు పదుల లోపే ఉండేది. అదే ఎన్టీయార్ కి నాడు ఆరు పదుల వయసు నిండి ఉంది. కాబట్టి పెద్దాయంగా భావించి తాము దండాలు పెట్టామని చెప్పుకునేవారు. అయినా సరే అది ఎబ్బెట్టుగా మారి చివరికి అతి పెద్ద చర్చకు దారితీసి టీడీపీ ఓడిపోవడానికి ఒక నెగిటివ్ కాన్సెప్ట్ గా తయారైంది.

సీన్ కట్ చేస్తే వైసీపీలో కూడా కాళ్ళమొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. మంత్రుల కాళ్ళకు దండాలు పెట్టేవారు, పార్టీలో సీనియర్ నాయకులకు కాళ్ళు కడిగేవారూ వైసీపీలో కనిపిస్తున్నారు. ఈ మధ్యనే గోదావరి జిల్లాలో జరిగిన ఒక సభలో ఏకంగా వేదిక మీదనే వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కాళ్ళకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ దండం పెట్టి అతి పెద్ద చర్చకు దారి తీశారు.

ఇపుడు అదే వరసలో మరో మంత్రి సీదరి అప్పలరాజు కూడా పయనించడమే చిత్రం. ఆయన విజయనగరం జిల్లాలో గరివిడి వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారయణతో కలసి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి బొత్స సత్కరించారు. అంతే సడెన్ గా అప్పలరాజు బొత్స కాళ్ళకు దండం పెట్టేశారు. ఈ ఘటన కూడా ఇపుడు చర్చకు తావిస్తోంది.

దీనికంటే ముందు ఒక ఉన్నత అధికారి ఇదే విజయనగరం జిల్లాలో బొత్సకు పాదాభివందనం చేయడమూ చర్చగా సాగింది. అయితే తనకంటే వయసులో పెద్దాయన కాబట్టే బొత్సకు నమస్కరించాను అని సదరు అధికారి చెప్పుకున్నారు. ఇక్కడ ప్రతి మర్యాద చేయడం ఎపుడూ తప్పు కాదు, నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేయడం ఎపుడూ ఒప్పే, అది గొప్పే.

కానీ తమ హోదాను, తమ గౌరవాన్ని కూడా తగ్గించుకునేలా కాళ్ళ మీద పడి దండాలు పెట్టడమే చర్చకు దారితీస్తోంది. మంత్రి అంటే మంత్రే. జనాల దృష్టిలో సీనియర్ జూనియర్ అని ఉండరు. రాజ్యాంగంలో కూడా అలా ఏమీ లేదు. అందువల్ల బాహాటంగా మరో మంత్రికి దండాలు పెట్టడం వల్ల ఆ హోదాను తగ్గించినట్లు అవుతుందని గుర్తుంచుకోవాలి.

ఈ రోజు దేశంలో వ్యక్తి పూజలు ఎక్కువ అయిపోతున్నాయి. దాంతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఆ మధ్యన తెలంగాణాలో ఒక కలెక్టర్ గారు సీఎం కేసీయార్ కి పాదాభివందనం చేయడం గుర్తుండే ఉంటుంది. ఇలాంటివి ప్రజాస్వామ్య పోకడలకు చేటు తెస్తాయన్నదే అంతా గమనించాలి. పైగా తామెంతో గౌరవించి కాళ్ళకు మొక్కుతున్న వారికే చివరకు నిందలు తెస్తాయని కూడా గమనించి నడచుకుంటే మరీ మంచిది.