Begin typing your search above and press return to search.

విశాఖ గురించి దావోస్ లో అలా అడిగితే మంత్రి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయట

By:  Tupaki Desk   |   1 Jun 2022 6:30 AM GMT
విశాఖ గురించి దావోస్ లో అలా అడిగితే మంత్రి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయట
X
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన మంత్రివర్గంలోని వారు.. అధికారులతో కూడిన టీం ఒకటి వేర్వేరుగా రెండు విమానాల్లో దావోస్ కు వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఉదంతాల గురించి రాష్ట్ర ఐటీ.. పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

దావోస్ లో తనకు ఎదురైన ప్రశ్నల్లో తనను అత్యంత బాధ పెట్టిన ప్రశ్న గురించి చెప్పిన మంత్రి.. 'వరదలు వస్తే విశాఖపట్నం మునిగిపోతుందని దావోస్ లో ఒక ప్రతినిధి ప్రశ్నించారు. ఆ మాట విన్నంతనే నా కళ్లల్లోనీళ్లు తిరిగాయి. ప్రతిపక్షపార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ఒక మీడియా వర్గం విశాఖ మీద విషం చిమ్ముతోంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి అమర్ నాథ్ నోటి మాటలు వింటే.. దావోస్ లో పెట్టుబడుల ఆకర్షణ తర్వాత.. ఇబ్బందికర పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని.. అందుకే తనను అడిగిన ఆ ప్రతినిధికి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించానని.. రాష్ట్రంలో సాగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని.. దయచేసి ఎవరికీ చెప్పొద్దని తానుకోరినట్లు అందరికి చెప్పేయటం గమనార్హం.

మంత్రివారి మాటల్ని వింటే.. ఎక్కడో సంబంధం లేని దేశంలో.. ఒక ప్రతినిధి అడిగినంతనే.. రాష్ట్రంలో జరుగుతున్నట్లుగా చెప్పిన వివరాలు చెప్పాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. తప్పుడు వివరాల్ని ప్రస్తావిస్తే.. అలాంటిదేమీ లేదని.. ఆ వివరాలు ఆయనకు తప్పుగా చేరి ఉంటాయని చెప్పి.

అందుకు సంబంధించిన సాంకేతిక అంశాల్ని ఆయన చేతిలో పెట్టి.. పెట్టుబడుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా? అంతేకానీ ఏపీ రాజకీయాల గురించి.. ఏపీలో మీడియా ఏం చేస్తుందన్న వివరాల్ని దావోస్ లోని ప్రతినిధికి వివరించటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

దావోస్ పర్యటన సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో తాము భేటీ అయినట్లు చెప్పారు. దాదాపు 50 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు.. కొత్త పారిశ్రామికవేత్తలతో తాము భేటీ అయినట్లుగా పేర్కొన్నారు. వారందరికి ఏపీలో పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ఉన్న వనరుల గురించి వివరించాం. ఆ సదస్సు ద్వారా ఏపీకి రూ.1.25లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుందని పేర్కొన్నారు.