Begin typing your search above and press return to search.

స్పీక‌ర్‌ను సంక‌టంలో ప‌డేసిన మంత్రి ఆది

By:  Tupaki Desk   |   24 Oct 2017 2:46 PM GMT
స్పీక‌ర్‌ను సంక‌టంలో ప‌డేసిన మంత్రి ఆది
X
పార్టీ మారిన పెద్ద‌మ‌నిషి బాగానే ఉన్నాడు.. పార్టీ మార్పించిన పెద్దాయ‌న సుఖంగానే ఉన్నారు.. కానీ ఈ మొత్తానికి నిమిత్త‌మాత్రుడైన స్పీక‌ర్‌ ను సంక‌ట‌స్థితిలో ప‌డేశారు ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు ఎవ‌రైనా స‌రే పార్టీలోకి తీసుకొచ్చేందుకు గేట్లు ఎత్తేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు పుణ్య‌మా అని.. విప‌క్ష నేత జ‌గ‌న్‌ కు హ్యాండిచ్చినోళ్లు ఎంద‌రో.

త‌న ఫ్యాన్ గుర్తు మీద గెలిచినోళ్లంతా త‌నకు షాకిస్తుంటే ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు జ‌గ‌న్‌. అలా జంప్ అయిన ప‌లువురు నేత‌లు జ‌గ‌న్‌ పై చేస్తున్న వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు ఇబ్బంది క‌లిగించేవే. అధినేత‌కు షాకిచ్చే అల‌వాటు అధికార‌ప‌క్షంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా వ‌దిలిపెట్ట‌ని నేత‌ల కార‌ణంగా ఏపీ సీఎం సైతం చిక్కుల్లో ప‌డుతున్నారు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మాట‌ల్ని చెప్పాలి.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాకు రెఢీగా ఉన్నారంటూ మంత్రి ఆది చెప్ప‌టం వ‌ర‌కూ బాగానే ఉన్నా.. త‌న రాజీనామా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏపీ స్పీక‌ర్‌ కు కొత్త సంక‌టాన్ని తెచ్చి పెట్టింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాను పార్టీ మారిన‌ప్పుడే త‌న రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు ఇచ్చేసిన‌ట్లుగా చెప్పుకొచ్చారు ఆది.

త‌న ప‌ని తాను చేశాన‌ని.. తన రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ ఆమోదించ‌క‌పోతే తాను మాత్రం ఏం చేయ‌గ‌ల‌న‌నంటూ మంత్రి ఆది చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త క‌ల‌క‌లానికి తెర తీస్తున్నాయి. త‌న రాజీనామాను స్పీక‌ర్ పెండింగ్ లో పెట్టార‌న్న ఆది మాట‌లు స్పీక‌ర్ కోడెల‌కు కొత్త స‌మ‌స్య‌గా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన రాజీనామాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు డిమాండ్ చేయ‌టం త‌న‌కు స‌మ‌స్యేన‌ని ఒప్పుకున్న ఆది.. ఎన్నిక‌లు అన‌వ‌స‌ర‌మ‌ని భావించ‌టం వ‌ల్లే త‌న రాజీనామాను స్పీక‌ర్ ఆమోదించ‌టం లేద‌మోన‌న్నాయ‌న‌.. నా రాజీనామాను ఆమోదించ‌మ‌ని స్పీక‌ర్ ను ఒత్తిడి చేయ‌లేమ‌ని చెప్ప‌లేం క‌దా? అంటూ త‌న మాట‌ల‌తో స్పీక‌ర్ కోడెల‌ను మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేశారు మంత్రి ఆది. మ‌రి.. మంత్రివ‌ర్యుల మాట‌ల‌కు స్పీక‌ర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.