Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసిన ఎంఐఎం

By:  Tupaki Desk   |   24 Oct 2019 6:17 AM GMT
మహారాష్ట్రలో కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసిన ఎంఐఎం
X
ఎంఐఎం పార్టీ: హైదరాబాద్ పాతబస్తీలో పుట్టిన పార్టీ. ముస్లింలకు ప్రతినిధులమని చెప్పుకొనే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ దేశవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీని విస్తరించడం కాంగ్రెస్ కు షాకింగ్ లా మారింది. ఇదే ఇప్పుడు పార్టీని దెబ్బ తీస్తోంది.

దేశంలో లౌకిక పార్టీగా కాంగ్రెస్.. హిందుత్వ పార్టీగా బీజేపీ ముందుకెళుతోంది. ముస్లింలు అంతా తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీకి అస్సలు ఓటేయరు. వారంతా కాంగ్రెస్ వెంటే ఇన్నాల్లు నడుస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎంఐఎంను విస్తరించి అసదుద్దీన్ ముస్లిం ఓటు బ్యాంకును తనఖాతాలో వేసుకుంటున్నారు. ఇదే పరిణామం కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు.

మహారాష్ట్రలో ఎంఐఎం పోటీచేస్తోంది. ఔరంగాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఔరంగాబాద్, అహ్మద్ పుర, బీర్ , కొల్హాపూర్ లలో ముందంజలో ఉంది. ఇక ఎంఐఎం ఆధిక్యంతో అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ అవాక్కైంది.

ఔరంగాబాద్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండేది. ఈ జిల్లాలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. వీరంతా కాంగ్రెస్ కే ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో ఎంఐఎం రావడంతో కాంగ్రెస్ ఓటు చీలి ఎంఐఎంకు పడిపోయింది.

ఈ పరిణామం బీజేపీకే కలిసివచ్చింది. ముస్లింల ఓట్లు బీజేపీకి ఎలాగూ పడవు. కాంగ్రెస్ కు పడే ఓట్లను ఎంఐఎం పోటీచేసి చీల్చింది. ఇదేకాదు.. మహారాష్ట్రలోని 24 నియోజకవర్గాల్లో పోటీచేసిన ఎంఐఎం అభ్యర్థులు కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చి అక్కడ బీజేపీకి గెలుపు అవకాశాలు పెంచారు. ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎంఐఎం చావు దెబ్బ తీసినట్టైంది.