Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నిక‌ల్లో `జ‌గ‌న్ ఫార్ములా` ఎంఐఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   23 Jan 2022 1:30 AM GMT
యూపీ ఎన్నిక‌ల్లో `జ‌గ‌న్ ఫార్ములా` ఎంఐఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి న‌చ్చిన వ్యూహాన్ని వారు అమ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ల‌క్ష్యంగా నాయ‌కులు ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ.. కూడా ఒక వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. అది ఏపీలో ఆయ‌న స‌న్నిహితుడు, వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ అనుస‌రించిన ఫార్ములా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ఈ విష‌యం.. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ ఆస‌క్తిగా మారింది. యూపీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంటే.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు, ముగ్గురు ఉప ముఖ్య‌మంత్రుల‌తో పాల‌న చేస్తామ‌ని ఒవైసీ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులను ఎంఐఎం అధినేత ఒవైసీ ఖరారు చేశారు. బాబు సింగ్ కుష్వాహ, భారత్ ముక్తి మోర్చాతో తమ పార్టీ పొత్తు కుదుర్చుకుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రులలో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు, మరొకరు దళిత వర్గానికి చెందిన వారు ఉంటారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రుల్లో ముస్లిం వర్గానికి చెందిన వారు ఒకరు ఉంటారని వివరించారు. ఇది ఏపీలో సీఎం జ‌గ‌న్ అనుస‌రించిన ఫార్ములానే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఏపీలో ఒక ముఖ్య‌మంత్రి ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రులు ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే, ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు ఉంటుందని ఒవైసీ ఇంతకుముందు ప్రకటించారు. అయితే, కూటమి నుంచి రాజ్‌భర్ తప్పుకుని సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టారు. ఎస్‌బీఎస్‌పీ సొంత నిర్ణయం తీసుకుని కూటమి నుంచి వైదొలిగిందని, అయితే ఎంఐఎం పటిష్టంగా ఉన్నందున 100 సీట్లలో పోటీ చేస్తామని ఒవైసీ చెప్పారు. ముస్లింల అభివృద్ధికి ఏ ఒక్క పార్టీ పని చేయలేదని ఆరోపించారు. ముస్లింలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయని, ఇదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని, ప్రజలే ఏ పార్టీతో వెళ్లాలనేది నిర్ణయించుకుంటున్నారని చెప్పారు. కాగా, యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10వ తేదీతో మొదలై మార్చి 7న జరిగే ఏడో విడత పోలింగ్‌తో ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు. మ‌రి ఒవైసీ అనుస‌రిస్తున్న జ‌గ‌న్ ఫార్ములా ఏమేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి.