Begin typing your search above and press return to search.

సొంత ఇంట్లో రాకెట్ త‌యారు..అకాశంలోకి ప్ర‌యాణం

By:  Tupaki Desk   |   26 March 2018 4:55 AM GMT
సొంత ఇంట్లో రాకెట్ త‌యారు..అకాశంలోకి ప్ర‌యాణం
X
ఆస‌క్తి ఉంటే...అందుకు ఉత్సాహం తోడ‌యితే...ఇంట్లో సొంతగా సైకిల్‌ నో.. బైక్‌ నో.. కార్‌ నో తయారు చేసేవాళ్లను చూసుంటాం.. మరి ఓ వ్యక్తి సొంతగా రాకెట్‌ ను నిర్మించుకుంటే..? దాంట్లో దాదాపు 1900 అడుగుల ఎత్తువరకు ప్రయాణించి క్షేమంగా భూమిని చేరితే?.. ఇదెలా సాధ్యం అని అనిపిస్తున్నదా? అమెరికాకు చెందిన మైక్ హ్యూస్ దీనిని సుసాధ్యం చేసి చూపించారు. ఆయన గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేశారు. అందుకే ఆయన్ను అభిమానులు డేర్‌ డెవిల్ - రాకెట్ మ్యాన్ అని పిలిస్తే.. విమర్శకులు మాత్రం పిచ్చోడిగా జమకడుతూ మ్యాడ్ మైక్ అని పిలుస్తుంటారు.

కాలిఫోర్నియాలోని ఆపిల్‌ వ్యాలీలో నివసించే 61 ఏళ్ల మైక్.. లిమో కార్ డ్రైవర్‌ గా (అమెరికాలో కనిపించే పొడవైన కార్లు) పనిచేస్తుంటారు. ఆయ‌నే తాజాగా ఈ ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యారు. మైక్ తన ప్రయోగం కోసం లాస్ ఏంజిల్స్ నగరానికి 320 కిలోమీటర్ల దూరంలోని ఆంబోయ్ పట్టణ పరిధిలో ఉన్న ఓ ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. రాకెట్ జనావాసాలపై పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. తన మొబైల్ హోంను రాకెట్ లాంచర్‌ గా మార్చి ఏటవాలుగా ప్రయోగాన్ని నిర్వహించారు. శనివారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఎలాంటి కౌంట్‌ డౌన్ లేకుండా రాకెట్‌ లోని ఇంధనాన్ని మండించారు. రాకెట్ దాదాపు గంటకు 563 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయింది. మైక్ 1,875 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత రాకెట్ నుంచి బయటికి వచ్చి పారాచూట్ సాయంతో కిందికి దిగారు. మైక్ క్షేమంగా భూమిని చేరగా.. రాకెట్ ప్రయోగస్థానం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో పడింది. రాకెట్ ముందు భాగం భూమిని గుద్దుకోగానే రెండు ముక్కలుగా విడిపోయేలా డిజైన్ చేశారు. ప్రయోగం మొత్తం మూడు నుంచి నాలుగు నిమిషాల్లో పూర్తయింది.

ఇక త‌న సంచ‌ల‌న ఫీట్ గురించి వివ‌రిస్తూ...అందరూ చెప్తున్నట్టు భూమి గుండ్రంగా లేదని - సమతలంగా ఉన్నదని మైక్ గట్టిగా నమ్ముతారు. అందుకే భూమికి వందల మీటర్లు ఎత్తుకు ఎగిరి భూమి సమతలంగా ఉన్నదో లేదో చూడాలనుకునే వాడనని, హేళన చేసేవాళ్లను చూసి రాకెట్ తయారు చేయాలన్న కసి తనలో పెరిగిందని మైక్ చెప్పారు.రాకెట్‌ ను నిర్మాణ సాంకేతికతను సొంతగా నేర్చుకున్న మైక్ ఇంటి వెనుక ఉన్న షెడ్‌లో దానిని రూపొందించారు.