Begin typing your search above and press return to search.

పోలీసులతో సంబంధాలు తెంచుకోండి..మైక్రోసాఫ్ట్ సీఈవోకి ఉద్యోగుల లేఖ!

By:  Tupaki Desk   |   11 Jun 2020 5:30 PM GMT
పోలీసులతో సంబంధాలు తెంచుకోండి..మైక్రోసాఫ్ట్ సీఈవోకి ఉద్యోగుల లేఖ!
X
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ హత్య తో అమెరికా గత కొన్నిరోజులుగా నిరసనలతో హోరెత్తుతుంది. నిరాయుధులైన నల్లజాతీయులను పోలీసులు హత్య చేయడంపై జాత్యహంకార వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఇంకెన్నాళ్లు ఈ జాతి వివక్ష అంటూ వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ..తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసన సెగలు వైట్ హౌస్ కి కూడా పాకిన సంగతి తెలిసిందే. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నా కూడా పరిస్థితులు అదుపులోకి రావడంలేదు.

ఈ నిరసనలకు ఐటీ దిగ్గజాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ సీఈవో సత్య నాదెళ్లకు పంపించిన ఈమెయిల్ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సియాటెల్ పోలీసు విభాగం, ఇతర చట్ట అమలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. 200 మందికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సీఈఓ సత్య నాదెళ్ల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్బెన్ ‌లను ఉద్దేశించి అంతర్గత ఇ-మెయిల్ ద్వారా విజ్ఙప్తి చేశారు.

వన్‌జీరో.మీడియం నివేదిక ప్రకారం "మా పొరుగు ప్రాంతాన్ని వార్‌జోన్‌గా మార్చారు" అనే పేరుతో ఈ సందేశాన్ని పంపారు. సియాటెల్ పోలీసు విభాగం (ఎస్ ‌పీడి) ఇతర చట్ట సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడంతోపాటు బ్లాక్ లైవ్స్ మేటర్ (బీఎల్ ఎమ్ ) ఉద్యమానికి అధికారికంగా మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే సియాటెల్ నగర మేయర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమలో ప్రతి ఒక్కరం ఎస్ ‌పీడీ అమానవీయ దాడులకు బాధితులమని లేఖలో తెలిపారు.