Begin typing your search above and press return to search.

‘‘పెద్దన్న’’ కోరికలన్నీ తీర్చేసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   19 April 2016 4:34 PM GMT
‘‘పెద్దన్న’’ కోరికలన్నీ తీర్చేసుకుంటున్నారా?
X
ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించటం అంత చిన్న విషయం కాదు. అందులోకి ఒకటి కాదు రెండు దఫాలు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అదృష్టం ఎంతమందికి వస్తుంది. అమెరికా దేశ చరిత్రలో శ్వేతజాతేతర వ్యక్తికి అమెరికా అధ్యక్ష పదవి లభించటం చారిత్రకమనే చెప్పాలి. అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నా బరాక్ ఒబామా.

అమెరికా చట్టాల ప్రకారం ఏ నేత అయినా సరే రెండుసార్లకు మించిన అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం లేని నేపథ్యంలో.. మరి కొద్ది నెలల్లో ఆయన పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటూ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో చారిత్రక ఘట్టాల్లో తన పేరు నమోదు కావాలన్న తపనతో ఉన్నట్లుగా ఒబామా వైఖరి చూస్తే అర్థమవుతుంది.

ఈ మధ్యనే అమెరికాకు బద్ధశత్రువైన క్యూబాకి వెళ్లిన సంచలనం సృష్టించిన ఒబామా ఫ్యామిలీ తాజాగా మరో ఆసక్తికర పర్యటనకు తెర తీస్తున్నారు. తాజాగా ఒబామా ఫ్యామిలీ బ్రిటన్ లో కాలు పెట్టనున్నారు. తమ పర్యటనలో భాగంగా బ్రిటన్ రాణి ఇచ్చే గౌరవ విందును ఒబామా స్వీకరించనున్నారు. అంతేకాదు.. రాణి విందు తర్వాత బ్రిటన్ యువరాజు విలియమ్.. యువరాణి కేథరిన్ లను కలుసుకోనున్నారు. ప్రపంచ పెద్దన్న బ్రిటన్ రాణి విందుకు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు అదరిపోయేలా చేయాలన్న ఆదేశాల్ని మహారాణి జారీ చేశారంట. చూస్తుంటే.. అధ్యక్ష పదవి నుంచి రిటైర్ అయ్యాక వీలైనన్ని తీపిగురుతుల్ని మూటగట్టుకోవటమే ఒబామా దంపతుల లక్ష్యంగా ఉన్నట్లుందే..?