Begin typing your search above and press return to search.

ముంబై ఊచకోత..నాలుగేళ్ళ తర్వాత రాజస్థాన్ పై విజయం

By:  Tupaki Desk   |   7 Oct 2020 9:30 AM IST
ముంబై ఊచకోత..నాలుగేళ్ళ తర్వాత రాజస్థాన్ పై విజయం
X
ఐపీఎల్ 2020లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన ముంబై - రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ముందుగా బ్యాటింగ్ లో దుమ్ము లేపిన ముంబై 193 పరుగులు చేయగా, ఆ తర్వాత అదరగొట్టే బౌలింగ్ తో రాజస్థాన్ రాయల్స్ ని వణికించింది. జోస్ బట్లర్ పోరాడినా అతడికి ఎవరూ సహకారం ఇవ్వక పోవడంతో 136 పరుగులకే ఆల్ ఔట్ అయి 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై కి ఇది వరుసగా మూడో విజయం. పాయింట్ల పట్టికలో కూడా ముంబై అగ్ర స్థానానికి చేరుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది.

ముందుగా డికాక్‌ (23)-రోహిత్‌ (35) జోడి 49 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 నాటౌట్‌) బౌండరీలతో చెలరేగిఆడాడు. హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 నాటౌట్‌) రాణించాడు. దీంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన రాజస్థాన్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. బుమ్రా (4/20) పదునైన బంతులతో బెంబేలెత్తించాడు. రాజస్థాన్ తొలి మూడు ఓవర్లలోనే యశస్వి జైస్వాల్‌ (0), స్మిత్‌ (6), శాంసన్‌ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బట్లర్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.లోమ్రోర్‌ (11)టామ్‌ కర్రాన్‌ (15), రాహుల్‌ తెవాటియా (5)లను వరుసగా ఔట్ అవడంతో రాజస్థాన్ ఇక కోలుకో లేకపోయింది.

మ్యాచ్ లో హైలెట్స్ ఇవే..

* ఐపీఎల్లో అత్యుత్తమ స్కోర్ నమోదు చేసిన సూర్య కుమార్(79) యాదవ్ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

* ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ తరపున బౌలర్ కార్తీక్ త్యాగి అరంగేట్రం చేశాడు.

* తొమ్మిదో ఓవర్‌ నుంచి తాను అవుటైన 14వ ఓవర్‌ వరకు బట్లర్ ఒక్కో ఓవర్లో ఒక్కో సిక్సర్‌ చొప్పున బాదాడు

* బట్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర పొలార్డ్‌ పైకి ఎగిరి మరీ అందుకున్నాడు.

* బుమ్రా సహా ముంబై బౌలర్ల విజృంభణతో రాజస్థాన్ జట్టులో ఏడు ఓవర్లలోనే చివరి ఆరు వికెట్లు పడ్డాయి.

* ముంబై చివరి మూడు ఓవర్లలో 51 పరుగులు సాధించింది. పొలార్డ్‌కు అసలు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

* ఐపీఎల్‌లో బుమ్రా ఉత్తమ గణాంకాలు (4/20) నమోదు చేశాడు. ఈ సీజన్‌లో డెత్‌ ఓవర్లలో ఎక్కువ వికెట్లు (9) తీసి రబాడ సరసన నిలిచాడు.

* ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. రైనా (193)ను అతడు అధిగమించాడు.

* ముంబై ఇండియన్స్‌ 2015 నుంచి ఇప్పటి వరకు రాజస్థాన్‌ రాయల్స్‌ ను నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఓడించ లేకపోయింది. ఈ సారి మాత్రం ఊచకోత కోసింది.