Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో.. పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ రెఢీ

By:  Tupaki Desk   |   2 Sep 2021 1:30 PM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో.. పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ రెఢీ
X
హైదరాబాద్ మహానగర ప్రజారవాణాలో కొత్త శకంగా అభివర్ణించే మెట్రో రైల్.. ఆశించిన దాని కంటే బాగానే క్లిక్ అయ్యింది. బ్యాడ్ లక్ ఏమంటే.. సరిగ్గా టేకాఫ్ సమయానికి కరోనా వచ్చి పడటంతో.. హైదరాబాద్ మెట్రో తీవ్రమైన ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. తాజాగా ఈ ప్రాజెక్టులో ప్రధాన పెట్టుబడిదారు అయిన ఎల్ అండ్ టీ తన వాటాను అమ్మేసేందుకు సిద్ధమవుతుందన్న వార్తలు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మెట్రో రెండో దశలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లింకు చేయాలన్న ఆలోచన ఎప్పటిదో.కానీ.. దాని కార్యాచరణ మాత్రం షురూ కాలేదు.

తాజాగా ఆ కొరతను తీరుస్తూ..శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రోరైలుకు సంబంధించిన ఒక కొత్త అంశం బయటకు వచ్చింది. ఎయిర్ పోర్టు మెట్రో లింకు ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ మౌలికవసతుల సంస్థ జీఎంఆర్ ముందుకు వచ్చింది. దాదాపు రూ.5195 కోట్ల అంచనాతో చేపడుతున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టులో పది శాతం వాటా పెట్టేందుకు జీఎంఆర్ సిద్ధమైంది. తన వాటా కింద రూ.519.52 కోట్లకు రెఢీ అయ్యింది.

మెట్రో రైల్ రెండో దశలో భాగంగా ఐటీ కారిడార్ లో కీలకమైన.. చివరి మెట్రో స్టేషన్ అయిన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లింకు కలుపుతారు. మొత్తం 30.7 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ మెట్రోని నిర్వహించాలని మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక అంచనా ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో లింకు కలిపితే ఏడాదికి 3.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారన్న అంచనా ఉంది.

ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ ప్రెస్ మెట్రోలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏడు లేదంటే ఎనిమిది మాత్రమేస్టేషన్లు ఉండనున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రతి కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ వరకు ఒక్కో స్టేషన్ ఉండేలా డిజైన్ చేశారు. శంషాబాద్ ప్రాజెక్టులో మాత్రం అందుకు భిన్నంగా ఐదారు కిలోమీటర్లకు ఒకటి చొప్పున మాత్రమే స్టేషన్ ఉంటుంది.

డీపీఆర్ ప్రకారం చూస్తే..గచ్చిబౌలి ఓఆర్ఆర్సర్వీసు రోడ్డు పక్క నుంచి వెళ్లే ఈ మెట్రో రైలులో కొంతభాగం భూగర్భాన ప్రయాణం చేయనుంది. ఈ ప్రాజెక్టులో తాజాగా జీఎంఆర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటంతో.. రెండో దశ మెట్రోకు కదలిక మొదలైనట్లుగా చెప్పక తప్పదు.