Begin typing your search above and press return to search.

పాత‌బ‌స్తీకి మెట్రో క‌ష్ట‌మేనంట‌.. ఎందుకంటే..

By:  Tupaki Desk   |   26 Dec 2017 8:33 AM GMT
పాత‌బ‌స్తీకి మెట్రో క‌ష్ట‌మేనంట‌.. ఎందుకంటే..
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెట్రోరైలు హైద‌రాబాద్ వాసులకు అందుబాటులోకి వ‌చ్చేసింది. మెట్రో వ‌చ్చినంత‌నే హైద‌రాబాద్ ప్ర‌జార‌వాణా మొత్తం మారిపోతుందంటూ తెగ క‌బుర్లు చెప్పిన వారు ఇప్పుడు కామ్ అయిపోతున్నారు. మెట్రో స్టార్ట్ అయిన వెంట‌నే.. పోటెత్తిన ప్ర‌యాణికుల‌ను చూసి.. మెట్రో రైల్ సూప‌ర్ హిట్ అన్న వ్యాఖ్య‌లు చేసేసినోళ్లు చాలామందే ఉన్నారు.

రోజుకు ల‌క్ష‌కు పైగా ప్ర‌యాణికులు ప్ర‌యాణిస్తున్న‌ట్లు చెబుతున్న మెట్రో రైల్ ర‌ద్దీ అంతా వాపే కానీ బ‌లుపు ఎంత మాత్రం కాదన్న విష‌యం తెలిపోయింది. మొద‌టి ప‌ది రోజులు మెట్రో స్టేష‌న్లు అన్ని ప్ర‌యాణికుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కేవల వీకెండ్ ల‌లో మాత్ర‌మే మెట్రోల‌లో ర‌ద్దీ క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. మొదటి ప‌ది రోజుల పాటు జాయ్ రైడ్స్ తో కిట‌కిట‌లాడిన మెట్రోస్టేష‌న్లు ఇప్పుడు ప్ర‌యాణికులు లేక వెల‌వెల‌బోతున్నాయి.

హైద‌రాబాద్‌ కు మెట్రో రైలు వ‌స్తే చాలు.. సొంత వాహ‌నాల్ని వ‌దిలేసి.. ఎంచ‌క్కా మెట్రో రైలు ఎక్కేస్తార‌న్న లెక్క‌లు త‌ప్పుతున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడున్న రెండు రూట్ల‌లో రైళ్లు స‌రిగా నిండ‌ని వేళ‌.. కొత్త మార్గాల్లో ఎలాంటి స్పంద‌న ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. టికెట్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌టం.. కొన్ని ప్రాంతాల్లో రైలు నెమ్మ‌దిగా వెళ్ల‌టంతో పాటు.. రైళ్ల మ‌ధ్య ఫ్రీక్వెన్సీ సైతం ప్ర‌యాణికుల‌కు విసుగు వ‌చ్చేలా చేస్తుంద‌ని చెబుతున్నారు.

దీనికి తోడు.. మెట్రో స్టేష‌న్ల నుంచి కాల‌నీల‌కు ఏర్పాటు చేస్తామ‌న్న బ‌స్సులు అందుబాటులోకి రాక‌పోవ‌టం.. మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద పార్కింగ్ స‌దుపాయం లేక‌పోవ‌టంతో .. మెట్రో ఎక్కేందుకు ప‌లువురు మ‌క్కువ చూప‌టం లేదు. ఇలాంటి వేళ‌.. పాత‌బ‌స్తీకి మెట్రో రైలును విస్త‌రించాల‌న్న వాద‌న‌పై భిన్న‌మైన మాట వినిపిస్తోంది. మొద‌ట్లో అనుకున్న‌ట్లు పాత‌బ‌స్తీకి మెట్రోను విస్త‌రించే అవ‌కాశం లేదంటున్నారు. పాత‌బ‌స్తీకి మెట్రో వ‌ద్దంటున్న మ‌జ్లిస్ మాట‌తో పాటు.. ఇప్పుడున్న ప్ర‌ధాన రూట్ల‌లోనే ర‌ద్దీ అంతంత‌మాత్రంగా ఉంటే.. పాత‌బ‌స్తీలో ర‌ద్దీ ఉండే అవ‌కాశం లేదంటున్నారు. మెట్రో టికెట్ల ధ‌ర‌ల్ని స‌గానికి పైనే త‌గ్గిస్తే త‌ప్పించి ఆద‌ర‌ణ ఉండ‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పాత‌బ‌స్తీకి మెట్రో అన్న‌ది ఇప్ప‌ట్లో వ‌ర్క్ వుట్ అయ్యే వ్య‌వ‌హారం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.