Begin typing your search above and press return to search.

సచిన్ ని ఆమె మూణ్నెళ్లలో అధిగమించింది

By:  Tupaki Desk   |   3 Aug 2016 3:49 PM IST
సచిన్ ని ఆమె మూణ్నెళ్లలో అధిగమించింది
X
ఇద్దరూ వారివారి రంగాల్లో దిగ్గజ ఆటగాళ్లే. ఒకరు సుదీర్ఘ కెరీర్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అనిపించుకున్న సచిన్ టెండూల్కర్ కాగా.. ఇంకొకరు ఇండియాలో బాక్సింగ్ కు - అందులోనూ మహిళల బాక్సింగుకు పేరు తెచ్చిన మేరీ కోమ్. ఇద్దరూ క్రీడా కెరీర్ తరువాత చట్టసభలో అడుగుపెట్టారు. సచిన్ నాలుగేళ్ల కిందటే రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ కాగా మేరికోమ్ ఇటీవల నామినేట్ అయ్యారు. అయితే... సచిన్ కంటే ఆమె సభలో చురుగ్గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మూడేళ్లకు గాని ఓ ప్రశ్నను సంధించలేకపోయారు. అంతేకాక పార్లమెంటు సమావేశాలకు హాజరు శాతంలోనే ఆయన వెనుకబడిపోయారు. సచిన్ కు భిన్నంగా మేరీ కోమ్ తాను ఎన్నికైన మూడు నెలల్లోనే.. తన తొలి సమావేశాల్లోనే ప్రశ్న సంధించి ఆకట్టుకున్నారు. రాజ్యసభకు నామినేట్ అయ్యే ప్రముఖులు సభకు రారు.. ఏమీ మాట్లాడరు.. ప్రశ్నించరు అన్న అపవాదును ఆమె చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు.

రియో ఒలింపిక్స్ కు అవకాశం దక్కని మేరీ కోమ్... అక్కడికి వెళుతున్న భారత క్రీడాకారులకు మాత్రం రాజ్యసభ సాక్షిగా విషెస్ చెప్పారు. అంతేకాకుండా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఇంటర్నేషనల్ ఈవెంట్లకు వెళ్లే భారత క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించారు. అంతేకాకుండా శిక్షణా సమయాల్లోనూ క్రీడాకారులకు అవసరమైన మేర పోషకాహారాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మేరీ కోమ్ సూచనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్... క్రీడాకారులపై మరింత శ్రద్ధ పెడతామని ప్రకటించారు.

మొన్న ఏప్రిల్ లో ఆరుగురిని బీజేపీ నామినేట్ చేయగా అందులో మేరీ కోమ్ కూడా ఒకరు. మేరీ కోమ్ తో పాటు సిద్ధూ - సుబ్రమణ్య స్వామిలను కూడా బీజేపీ అదే సమయంలో నామినేట్ చేసింది. అయితే.. ఈ సమావేశాలకు మేరీ కోమ్ క్రమం తప్పకుండా వస్తూ రాజకీయేతర రంగాలకు చెందిన నామినేటెడ్ సభ్యులు రాజ్యసభను సీరియస్ గా తీసుకోవడం లేదన్న వాదన ఉంది. మేరీ కోమ్ ఇలాగే కొనసాగితే కొంతయినా ఆ అభిప్రాయం తొలగే అవకాశం ఉంది.