Begin typing your search above and press return to search.

సైరస్ మిస్త్రీ మరణం తర్వాత మెర్సిడెజ్-బెంజ్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   7 Sept 2022 11:06 AM IST
సైరస్ మిస్త్రీ మరణం తర్వాత మెర్సిడెజ్-బెంజ్ సంచలన ప్రకటన
X
అత్యాధునిక సౌకర్యాలు..ప్రమాదాలు జరిగినా ప్రాణాలు కాపాడే రక్షణ వ్యవస్థలు ఉన్నా కూడా.. మెర్సిడెజ్ బెంజ్ లాంటి కోట్ల విలువైన కారులో ప్రయాణించినా.. ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ప్రాణాలు దక్కలేదు.

మహారాష్ట్రలో కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలైన తర్వాత మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణానికి దారితీసిన కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది.

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, అతని స్నేహితుడు జహంగీర్ పండోలే ఆదివారం మధ్యాహ్నం వారి మెర్సిడెజ్ జిఎల్‌సి 220డి 4మ్యాటిక్ కారులో వేగంగా ప్రయాణిస్తుండగా.. కారు ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో మరణించారు. కారులో ఉన్న మరో ఇద్దరు అనాహిత పండోలె, ఆమె భర్త డారియస్ పండోల్ గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన మిస్త్రీని సెంట్రల్ ముంబైలోని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

సైరస్ మిస్త్రీ మరణానికి కారణమైన ఆయన వాడి కారు బెంజ్ కంపెనీది.. దీంతో మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. 'కస్టమర్ గోప్యతను గౌరవించే బాధ్యతాయుతమైన బ్రాండ్‌గా మా బృందం సాధ్యమైనంతవరకూ విచారణ జరుపుతు్న అధికారులకు సహకరిస్తోంది. అవసరమైనప్పుడు మేము వారికి ఏవైనా వివరణలను నేరుగా అందిస్తాము. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్‌ల అకాల మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. అదే సమయంలో అనాహిత పండోల్ మరియు డారియస్ పండోల్ కోలుకుంటున్నారని తెలుసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. కారు ప్రమాదమా? లేక ఇంకా ఏదైనా అన్న దానిపై అధికారులకు సహకరిస్తాం' అని కార్ల కంపెనీ తెలిపింది.

మెర్సిడెజ్ బెంజ్ ఇండియా తన వాహనాలను సరికొత్త భద్రతా ఫీచర్లు, సాంకేతికతలతో తీర్చిదిద్దుతుతంది. బాధ్యతాయుతమైన తయారీదారుగా రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కొనసాగిస్తానని ప్రకటనలో తెలిపింది.

ప్రమాదం జరిగినప్పుడు లగ్జరీ కారు వేగంగా వచ్చిందని.. బాధితులు సీటు బెల్టు పెట్టుకోలేదని..అందుకే మరణించారని సమాచారం. మెర్సిడెజ్ ఎస్.యూవీ ట్రాఫిక్ రికార్డ్ అతను ట్రాఫిక్ సిగ్నల్‌లను చూస్తే కారు అతివేగంగా వెళ్లినట్టు తెలిసింది. ఈ వేగంపై అనేక వరుస కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. వేగమే ప్రాణాలు తీసిందని చెబుతున్నారు.అన్ని రక్షణ ఫ్యూచర్లు ఉన్నా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ఈ మరణానికి కారణం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.