Begin typing your search above and press return to search.

అమర వీరుల సంస్మరణ దినం జనవరి 30 ..

By:  Tupaki Desk   |   30 Jan 2020 10:59 AM IST
అమర వీరుల సంస్మరణ దినం జనవరి 30 ..
X
మనుషులు జన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్నికూడా జయించిన మహానీయులు కొందరు మాత్రమే ఉంటారు. వారి కీర్తి ప్రతిష్టలు ఈ సృష్టిలో సూర్య చంద్రులున్నంత కాలం వెలుగొందుతూనే ఉంటాయి. మనకు తెలిసిన మనుషుల్లో మహాత్మునిగా నీరాజనాలందుకున్న వారు గాంధీజీ మాత్రమే. కత్తులు, కఠారులు, బాంబులు, తుపాకులు ఏ ఆయుధం అవశరం లేకుండా అహింసనే ఆయుధంగా చేతబూని సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళ లో పోసిన త్యాగశీలి, అమరవీరులు మన బాపూజీ. అహింస ముందు ఎటువంటి గొప్ప శక్తైనా తలవంచక తప్పదు.హింసకు సరైన సమాధానం అహింస మాత్రమేనని గాంధీ నొక్కి చెప్పేవారు.

1948 జనవరి 30 యావత్ భారత జాతికే ఒక దుర్దినం . ఆరోజు సాయంత్రం 4 గంటలకు మన జాతిపిత, పూజ్య బాపూజీ ,అహింసా సిద్ధాంత ప్రవక్తలు నాథూరామ్ గాడ్సే తుపాకీ కాల్పులకు విగతజీవిగా మారి అక్కడే నేలకొరిగారు. స్వాతంత్ర సమర యోధుడైన గాంధీ మరణించిన జనవరి 30 వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం గా జరుపుకోవడం ఆనాటి నుండి ఒక ఆనవాయితీగా వస్తుంది.

దేశ రక్షణ కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి పగలనక ,రాత్రనక అహోరాత్రులు కాపలా కాసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయని అమర వీరులు ఎందరో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఎంతోమంది భారత దేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలని తృణ ప్రాయంగా వదిలేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి అమరవీరుల జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ పేరుతో ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. ఎంతోమంది వీరులు ,సైనికులు దేశం కోసం, దేశంలో నివసిస్తున్న ప్రజల కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసారు. అలాంటి మహనీయులని స్మరించుకోవాల్సిన రోజు ఈ రోజు ......