Begin typing your search above and press return to search.

ఆ మాట అన్న మీడియాపై ట్రంప్ భార్య కేసేసింది

By:  Tupaki Desk   |   2 Sept 2016 1:26 PM IST
ఆ మాట అన్న మీడియాపై ట్రంప్ భార్య కేసేసింది
X
కంపు మాటలు మాట్లాడి వివాదాలకు కేరాప్ అడ్రస్ గా నిలిచే రిపబ్లికన్ పార్టీ దేశాధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సతీమణి తాజా చర్య ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై కొన్ని మీడియా సంస్థలు వేసిన కథనంపై ఆమె సీరియస్ అయ్యారు. సదరు మీడియా సంస్థలపై ఆమె ఏకంగా రూ.వెయ్యి కోట్ల మేర పరువునష్టం దావా వేయటం గమనార్హం.

ట్రంప్ సతీమణి మెలానియాను సెక్స్ వర్క్ గా పేర్కొంటూ ప్రముఖ మీడియా సంస్థ డైలీ మెయిల్.. అమెరికాకు చెందిన బ్లాగ్ టార్ ప్లేలు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించి సంచలనం సృష్టించారు. ఈ కథనంలో మెలానియా ఎస్కార్ట్ గా పని చేశారని.. ఆ సందర్భంలోనే ఆమెకు ట్రంప్ పరిచయం అయినట్లుగా పేర్కొంది. న్యూయార్క్ లో మెలానియా పార్ట్ టైం సెక్స్ వర్కర్ గా వ్యవహరించారని సదరు కథనంలో పేర్కొన్నారు.

ఈ కథనంపై మెలానియా తీవ్రంగా స్పందించారు. ఈ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఆమె పరువు ప్రతిష్టల్ని తీవ్రంగా దెబ్బ తీసేలా కథనం ఉందంటూ ఆమె తరఫు న్యాయవాది ఛార్లెస్ హార్డర్ పేర్కొన్నారు. తన పరువుప్రతిష్టల్ని.. గౌరవ మర్యాదల్ని దెబ్బ తీసేలా ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. తన లాయరు ద్వారా మీడియా సంస్థలపై రూ.వెయ్యి కోట్ల మేర పరువునష్టం దావాను వేశారు. ఇష్టం వచ్చినట్లుగా రాసినందుకే ఈ చర్యలంటూ ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నారు. దాదాపు పదకొండేళ్ల క్రితం ట్రంప్ ను వివాహం చేసుకున్న మెలానియా గతంలో మోడల్ గా పని చేశారు. ఈ మధ్యనే ఆమెకు చెందిన నగ్నచిత్రాల్ని అమెరికాకు చెందిన మీడియాసంస్థలు ప్రచురించాయి. మోడలింగ్ కెరీర్ తొలినాళ్లలో ఆమె చేసిన ఫోటో షూట్ కు చెందిన ఈ ఫోటోలు విడుదల కావటం ఆ మధ్యన సంచలనాన్ని రేపింది.