Begin typing your search above and press return to search.

ఆత్మకూరులో మేకపాటి మేనల్లుడు...పోటీ తప్పదు...?

By:  Tupaki Desk   |   5 April 2022 9:52 AM GMT
ఆత్మకూరులో మేకపాటి మేనల్లుడు...పోటీ తప్పదు...?
X
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరుకు మరి కొద్ది నెలలలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఎన్నిక జరుగుతుందా లేదా ఏకగ్రీవమా అన్న చర్చ అయితే ఇప్పటికీ ఉంది. ఎందుకంటే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి కుటుంబం మీద అన్ని పార్టీలకు అభిమానం ఉంది. పైగా మరణించిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నారు.

ఆయన మరణం పట్ల అంతా సంతాపం ప్రకటించారు. అదే సమయంలో మేకపాటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. దాంతో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే ఉప ఎన్నిక అన్న ప్రసక్తే ఉండదు అని భావిస్తూ వచ్చారు. ఏకగ్రీవం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ సడెన్ గా ఒక నాయకుడు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయంగా మేనల్లుడు. పేరు బిజువేముల రవీంద్రరెడ్డి. ఆయన తాను పోటీకి సై అంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఒక హొటల్ లో మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన తాను ఆత్మకూరు బరిలో ఉంటున్నట్లుగా డిక్లేర్ చేసేశారు.

అంతే కాదు తాను బీజేపీ నేతను అని కూడా చెప్పుకున్నారు. అంటే బీజేపీ టికెట్ మీద ఆయన పోటీ చేస్తాను అని ప్రకటించారన్న మాట. మరి బీజేపీ అయితే పోటీకి ఎపుడూ సిద్ధమే. ఎందుకంటే ఆ పార్టీకి సానుభూతి రాజకీయాలు, కుటుంబాలు, వారసత్వాలు అంటే పెద్దగా గిట్టదు. పైగా ఈ మధ్యనే జరిగిన కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేసి ఇరవై వేలు ఓట్లు తెచ్చుకుంది.

మరి ఆ ఉత్సాహంతో ఆత్మకూరులో పోటీ చేయవచ్చు అంటున్నారు. జాతీయ పార్టీ కాబట్టి తాము పోటీ చేసి తీరుతామని బీజేపీ చెప్పుకుంటుంది కూడా. ఇక ఆ పార్టీకి సరైన క్యాండిడేట్ గా బిజువేముల రవీంద్ర రెడ్డి అనిపిస్తే ఆయనకే టికెట్ ఖాయమని అంటున్నారు. పైగా మేకపాటి ఫ్యామిలీ చుట్టం కావడంతో బీజేపీకి కొత్త ఆశలు కూడా ఉంటాయి.

మొత్తానికి ఆత్మకూరు ఉప ఎన్నికను సాఫీగా పోనీయకూడదు అనుకుంటే ఉప ఎన్నిక తెచ్చి అధికార పార్టీని వీలు అయినంతవరకూ జనంలో బదనాం చేయడానికి కూడా వాడుకోవచ్చు. నిత్యావసర‌ ధరలు బాగా పెరిగాయి, తాజాగా విద్యుత్ చార్జీల ధరలు పెరిగిన వైనమూ ఉంది. మొత్తానికి చూస్తే బీజేపీ పోటీకి సై అంటే కాంగ్రెస్ కూడా సిద్ధపడుతుంది.

అపుడు మరో బద్వేల్ ఉప ఎన్నిక అవుతుంది. ఫలితం అందరికీ తెలుసు. అయినా సరే అటూ ఇటూ రాజకీయ హడావుడి ఉంటుంది. అదే విధంగా మాటల తూటాలు పేల్చడానికి, వీరావేశాలు ప్రదర్శించడానికి ఆత్మకూరు ఉప ఎన్నిక ఒక వేదిక అవుతుంది అనుకోవాలి. సో నో కాంప్రమైజ్ అని బీజేపీ అంటే ఎన్నికలు జరగడం ఖాయమే.