Begin typing your search above and press return to search.

ఓట్లు తగ్గినా మెజార్టీ అదిరింది

By:  Tupaki Desk   |   25 Nov 2015 10:15 AM IST
ఓట్లు తగ్గినా మెజార్టీ అదిరింది
X
వరంగల్ ఉప ఎన్నికల్లో ఒక సిత్రం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్ సభా స్థానం నుంచి వచ్చిన ఓట్ల కంటే.. ఉప ఎన్నికల సందర్భంగా ఓట్లు తక్కువ వచ్చాయి. ఇలా తక్కువ ఓట్లు పోలైనప్పుడు.. మెజార్టీ మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తక్కువ ఓట్లు పోలై కూడా భారీ మెజార్టీ రావటం విశేషంగా చెప్పాలి.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వరంగల్ లోక్ సభా స్థానానికి జరిగిన ఎన్నికల్లో 76.59 ఓట్లు పోలయ్యాయి. ఇంత భారీగా ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 3,92,574 ఓట్లు మెజార్టీ వచ్చింది. తాజా ఉప ఎన్నికలో మొత్తం పోలైన ఓట్ల శాతం 69.19 శాతమే. కానీ.. వచ్చిన మెజార్టీ మాత్రం 4,59,092 ఓట్లు కావటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 2014 ఎన్నికలతో పోలిస్తే తాజా ఉప ఎన్నికలో పోలింగ్ తగ్గినా టీఆర్ఎస్ కు పడిన ఓట్లు భారీగా ఉండటంతో ఇంత బంపర్ మెజార్టీ సాధ్యమైందని చెప్పాలి. గణాంకాల్లో చెబితే.. 2014 ఎన్నికల్లో 76.59 శాతం ఓట్లు పోలైతే.. టీఆర్ ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి వచ్చిన ఓట్ల శాతం 56.33 అయితే.. ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కు 59.5 శాతం ఓట్లు రావటంతో ఇంత భారీ ఘన విజయం సాధ్యమైంది.

పోలింగ్ తగ్గినప్పుడు సాధారణంగా మెజార్టీ తగ్గుతుంది. అయితే.. పోలింగ్ తగ్గినా ఆ ప్రభావం అధికారపక్షం మీద పడకపోవటం ఒక విశేషమైతే.. ఓట్లు వేసిన ఓటర్లలో అత్యధికులు టీఆర్ఎస్ వెంట నడవటం కీలక పరిణామంగా చెప్పాలి. తాజా ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషిస్తే అర్థమయ్యేదేమంటే.. తెలంగాణ అధికారపక్షం మరింత బలపడితే.. తెలంగాణ విపక్షాలు మరింత బలహీనమైన విషయం స్పష్టమవుతుంది.

ఇక్కడే మరో ఉదాహరణ చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో విజేతగా నిలిచిన కడియం శ్రీహరికి 6,58,828 ఓట్లు వస్తే.. తాజా ఉప ఎన్నిక విజేత పసునూరి దయాకర్ కు వచ్చిన ఓట్లు 6,15,403 మాత్రమే. అంటే.. దాదాపు 43 వేల ఓట్లు తక్కువగా పడినా.. దాదాపు 67 వేల ఓట్ల మెజార్టీ అధికంగా రావటం విశేషం. ఇదే టీఆర్ ఎస్ అభ్యర్థి అద్భుత విజయానికి కారణంగా చెప్పాలి. తక్కువ ఓట్లతో భారీగా మెజార్టీతో జాతీయ రికార్డుల్లోకి ఎక్కటం వరంగల్ ఉప ఎన్నిక ప్రత్యేకతగా చెప్పాల్సిందే.