Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ తో డిన్నరే చోక్సీ కొంప ముంచిందట

By:  Tupaki Desk   |   31 May 2021 4:29 AM GMT
గర్ల్ ఫ్రెండ్ తో డిన్నరే చోక్సీ కొంప ముంచిందట
X
వేలాది కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టేసి.. మూడో కంటికి తెలీకుండా భారత్ ను వీడి విదేశాల్లో విలాసంగా గడుపుతున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇటీవల పట్టుబడటం తెలిసిందే. ప్రస్తుతం కరీబియన్ ద్వీప దేశమైన డొమినికాలోని జైల్లో ఉన్నాడు. తాను సేఫ్ గా ఉన్న ఆంటిగ్వాలోని నివాసాన్ని వదిలేసి.. ఆయన ఆ ద్వీపానికి వెళ్లటానికి కారణమేంటి? అన్న ప్రశ్న వేధిస్తోంది.

తాజాగా ఈ విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. తాజాగా ఆయన నివాసం ఉన్న ఆంటిగ్వాల ప్రధాని చోక్సీ వ్యవహారంపై స్పందించారు. గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా గడుపుదామనో.. డిన్నర్ కోసమో చోక్సీ ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు.. అక్కడి పోలీసులకు దొరికిపోయినట్లుగా పేర్కొన్నారు. ‘ఆయన చేసిన అతి పెద్ద తప్పు అదే. ఎందుకంటే.. ఆంటిగ్వాలో ఉంటే ఇక్కడి పౌరుడు కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుంది. మేం చోక్సీని భారత్ కు అప్పగించలేం’ అని ఆయన స్పష్టం చేశారు.

వజ్రాల వ్యాపారి చోక్సీ భారత్ నుంచి పారిపోయిన తర్వాత ఆంటిగ్వాలో పౌరసత్వం పొందటం ద్వారా.. ఆ దేశ రక్షణ ఛట్రంలోకి వెళ్లిపోయారు. ఆర్థిక నేరానికి పాల్పడినప్పటికి.. ఆంటిగ్వా దేశ తీరుతో బారత్ కు ఆయన్ను అప్పగించలేదు. తాజాగా పొరుగు దేశమైన డొమినికాకు వెళ్లి అడ్డంగా బుక్ అయిన వేళ.. ఆయన్ను అక్కడే ఉంచాలని అక్కడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఆయన్ను తమకు అప్పగించాలని భారత్ డొమినికా ప్రభుత్వాన్ని కోరుతోంది. కోర్టు ఆదేశాలతో మాత్రమే ఆయన్ను.. భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంటిగ్వా ప్రధాని చేసిన వ్యాఖ్యాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.