Begin typing your search above and press return to search.

ఆ సీఎం ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచారు

By:  Tupaki Desk   |   25 Jun 2016 12:01 PM GMT
ఆ సీఎం ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచారు
X
అనూహ్య పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మెహబూబా ముఫ్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ కాశ్మీర్ అనంత్ నాగ్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పీడీపీ అధినేతగా వ్యవహరిస్తున్న ఆమె.. తన తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పాలనా పగ్గాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలుస్వీకరించిన తర్వాత ఆర్నెల్ల వ్యవధిలో ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఆమె అనంత్ నాగ్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

గత ఏప్రిల్ 4న కశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె.. నిబంధనల ప్రకారం సీఎం పదవినిచేపట్టిన ఆర్నెల్ల వ్యవధిలో ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అనంత్ నాగ్ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మెహబూబా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన హైలాల్ అహ్మద్ షాను ఓడించారు. ఈ నెల 22న జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 28 వేల మంది ఓటుహక్కు వినియోగించుకోగా.. మెహబూబాకు 17వేల ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ షాకు 5,589 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక.. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇఫ్తిఖర్ మిస్గెర్ కు కేవలం 2,702 ఓట్లు రావటం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతానికి పైగా ఓట్లు మెహబూబా సొంతం చేసుకోవటం చూసినప్పుడు ఆమె విజయం ఘన విజయంగా అభివర్ణించొచ్చు.