Begin typing your search above and press return to search.

రేప్ చేస్తే ఉరేనంటున్న ముఖ్య‌మంత్రి

By:  Tupaki Desk   |   15 April 2018 5:52 AM GMT
రేప్ చేస్తే ఉరేనంటున్న ముఖ్య‌మంత్రి
X
కొన్నేళ్ల క్రితం యావ‌త్ దేశాన్ని ఏ రీతిలో అయితే రియాక్ట్ అయ్యేలా చేసిందో నిర్బ‌య ఉదంతం.. తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది జ‌మ్ముక‌శ్మీర్ కు చెందిన బాలిక అత్యాచార ఉదంతం. పాశ‌విక ఘ‌ట‌న‌గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌ముఖులు మొద‌లు సామాన్యుల వ‌ర‌కూ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున త‌ప్పు ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై జ‌మ్ముకశ్మీర్ ముఖ్య‌మంత్రి కాస్త భిన్నంగా రియాక్ట్ అయ్యారు. బాలిక‌ల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డేవారికి మ‌ర‌ణ‌దండ‌న విధించేలా త్వ‌ర‌లోనే తాము చ‌ట్టాన్ని త‌యారు చేయించ‌నున్న‌ట్లుగా ఆమె చెప్పారు.

క‌థువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం.. హ‌త్య ఘ‌ట‌న పెనుసంచ‌ల‌నంగా మారి.. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్ ప‌రువును న‌డిబ‌జార్లో నిల‌బెట్టిన వైనంపై జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ముఫ్తీ మొహ‌బూబా రియాక్ట్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు స‌త్వ‌ర న్యాయాన్ని ఏర్పాటు చేయ‌టానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల‌ని జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆమె జ‌మ్ముక‌శ్మీర్ హైకోర్టుకు లేఖ రాశారు.

మ‌రోవైపు.. ఈ ఘ‌ట‌న‌లో నిందితుల‌కు మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన ర్యాలీలో పాల్గొన్న ఇద్ద‌రు బీజేపీ మంత్రులు త‌మ రాజీనామాల్ని సీఎంకు స‌మ‌ర్పించారు. క‌థువా ఉదంతంలో యావ‌త్ భార‌తం త‌మ విభేదాల్ని ప‌క్క‌న పెట్టి బాధిత చిన్నారికి ఏక‌తాటిపై నిలిచార‌న్నారు.

క‌థువా నిందితులకు మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు ఇద్ద‌రు పాల్గొన‌టంపై జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వీరి రాజీనామాలు త‌న‌కు త‌క్ష‌ణ‌మే సమ‌ర్పించాల‌ని.. లేనిప‌క్షంలో ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తామంటూ క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ముఫ్తీ వార్నింగ్ ఇవ్వ‌టంతో హుటాహుటిన క‌శ్మీర్ వెళ్లిన రాం మాధ‌వ్‌.. అక్క‌డి బీజేపీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అనంత‌రం ఆ ఇద్ద‌రు మంత్రుల రాజీనామాల్ని ముఖ్య‌మంత్రికి పంపారు. వీటిని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఇంకా ఆమోదించాల్సి ఉంది.

ఈ ఉదంతంపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల్ని క‌వ‌ర్ చేసుకునేలా రాంమాధ‌వ్ మాట్లాడటం గ‌మ‌నార్హం. బీజేపీ మంత్రులు వివేచ‌న లేకుండా ర్యాలీలో పాల్గొన్నార‌ని.. అత్యాచార నిందితుల‌తో వారికి ఎలాంటి సంబంధం లేద‌న్నారు. మంత్రుల రాజీనామాల‌తో జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్ల‌దని స్ప‌ష్టం చేయ‌టం విశేషం. చూస్తుంటే.. క‌థువా ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన నిందితుల‌కు ప‌డాల్సిన శిక్ష కంటే కూడా.. జ‌మ్ముక‌శ్మీర్ లో త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా రాంమాధ‌వ్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.