Begin typing your search above and press return to search.

మృత్యుకుహరంలో కార్మికులు..సుప్రీం సంచ‌ల‌న ఆర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   3 Jan 2019 8:17 PM IST
మృత్యుకుహరంలో కార్మికులు..సుప్రీం సంచ‌ల‌న ఆర్డ‌ర్‌
X
మేఘాలయలోని జైంతియా కొండల్లో ఉన్న బొగ్గు గనిలో చిక్కుకున్న15 మంది కార్మికులను రక్షించే ఎపిసోడ్‌ లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ గనిలో సహాయ చర్యలు చేపట్టి మంగళవారానికి 20 రోజులైంది. భారత నౌకాదళ జవాన్లు - ఈతగాళ్లు - ఎన్‌ ఆర్డీఎఫ్ సిబ్బంది సాయంతో గని లోపలకు వెళ్లారు. మరోవైపు జిల్లా అధికారులు సహాయ చర్యలు మరింత వేగవంతం చేయడానికి మూడో క్రేన్‌ ను తీసుకొచ్చారు. గనిలో చిక్కుకున్న కార్మికులను కాపాడే విషయమై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా గనిలో చిక్కుకున్న వారి ప్రాణాలతో ఉన్నా - లేకున్నా సరే వారిని బయటకు తేవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

డిసెంబ‌ర్ 13 - 2018న లుంథారి గ్రామ శివారులో ర్యాట్ హోల్(ఎలుక కలుగు)గా పిలిచే 370 అడుగుల లోతులో ఉన్న ఇరుకైన గనిలోకి 20 మంది కార్మికులు పనికి వెళ్లారు. అయితే, సమీపంలోని లిటీన్ అనే నది వరద పోటెత్తి గనిలోకి చేరుకోవడంతో వారంతా అక్కడ చిక్కుకుపోయారు. ఐదుగురు మాత్రం ప్రాణాలకు తెగించి బయటపడగా - 15 మంది కార్మికులు ఇరుక్కుపోయారు. వీరిని రక్షించేందుకు కొద్ది రోజులుగా భారత నౌకాదళం - జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ ఎఫ్) - ఒడిశా అగ్నిమాపక సిబ్బంది - కోల్ ఇండియా (సీఐఎల్) - కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థలు రంగంలోకి దిగి శతమృత్యుకుహరంలో మేఘాలయ గని కార్మికులువిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. నౌకాదళానికి చెందిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం 370 అడుగుల లోతులో ఉన్న ఇరుకైన గనిలోకి ఆదివారం మధ్యాహ్నం దిగి అన్వేషణ ప్రారంభించింది. గనిలో పూర్తిగా నీరు నిండిపోవడంతో వారు కేవలం 100 అడుగల వరకు మాత్రమే వారు వెళ్లగలిగారు. నీటి మట్టం తగ్గితే కానీ తాము చేసేదేమీలేదంటూ వారు చేతులెత్తేశారు. మరోవైపు గనిలో నీటిని తోడేందుకు 10 భారీ సామర్థ్యం ఉన్న పంపుల్ని ఒడిశా అగ్నిమాపక సిబ్బంది సిద్ధం చేశారు. అయితే, పంపులను స్టార్ట్ చేస్తే గనిలో కార్బన్ పరిమాణం పెరిగి ఊపిరాడని పరిస్థితులు నెలకొంటాయని ఒడిశా చీఫ్ ఫైర్ ఆఫీసర్ సేథి ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వారు వేచి చూస్తున్నారు. అలాగే - నిమిషానికి 500 గ్యాలన్ల నీటిని తోడే భారీ పంపును రాంచీ నుంచి తీసుకువచ్చి సిద్ధంగా ఉంచారు. మరోవైపు కార్మికులు గనిలో చిక్కుకుని ఇప్పటికే 17 రోజులైందని - వారు సజీవంగా ఉండే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా ఉంది.

గనిలోని నీటిని తోడటం కోసం 10 హైపవర్ విద్యుత్ మోటార్లను వెంట తీసుకెళ్లారు. ఒక్కో మోటార్ నిమిషానికి 1,600 లీటర్ల నీటిని వెలికి తీయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మరోవైపు కోల్ ఇండియా - విద్యుత్ మోటార్ల తయారీ సంస్థ కిర్లోస్కర్ బ్రదర్స్ ప్రతినిధులు 18 మోటార్లు, 15 మంది ఈతగాళ్లతో మేఘాలయకు బయలుదేరారు. ఇదిలా ఉంటే మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మా.. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ తో భేటీ అయ్యారు. కాగా, 15 రోజుల క్రితం గని లోపల చిక్కుకున్న బాలలు మృతిచెంది ఉంటారని జాతీయ విపత్తు నివారణ సంస్థ పేర్కొంది.

ఓ వైపు ఇలా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతుండ‌గా వారి భ‌ద్ర‌త విష‌యమై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. స‌హాయక చర్యలపై తాము సంతృప్తిగా లేమని - ఇది చాలా తీవ్రమైన అంశమని, జీవన్మరణ సమస్య అని, కార్మికులు చిక్కుకుని చాలా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఆర్మీని ఎందుకు కోరలేదని - కార్మికులు బతికున్నా - చనిపోయినా సరే వారిని బయటకు తీసుకురావాలని, వారంతా ప్రాణాలతో బయటపడాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నామని కోర్టు తెలిపింది. ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించాలని సొలిసిటర్‌ జనరల్‌‌ ను ఆదేశించింది. కార్మికులను బయటకు తెచ్చేందుకు చేపట్టిన చర్యలపై నివేదికను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని పేర్కొంది.