Begin typing your search above and press return to search.

ఇద్దరు చంద్రుళ్లకు ముద్దుల ‘మెగా’

By:  Tupaki Desk   |   10 Sept 2015 9:31 AM IST
ఇద్దరు చంద్రుళ్లకు ముద్దుల ‘మెగా’
X
వ్యాపారానికి రాజకీయ రంగులతో పెద్దగా పని ఉండదంటారు. అధికారంలో ఎవరున్నా.. తమ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించటం.. అందుకు తగ్గట్లే ప్రాజెక్టులు చేజిక్కించుకోవటం అంత తేలికైన వ్యవహారం కాదు. అందులోకి నేతలంతా కాంట్రాక్ట్ వ్యాపారాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో.. అందరి మనసును దోచుకునే ప్రొఫెషనల్ వ్యాపార సంస్థలు కాస్త తక్కువే.

తెలుగు నేల మీద ఇప్పుడా కొరతను తీరుస్తూ తెరపైకి వచ్చింది మెగా కంపెనీ. వైఎస్ హయాంలో ఈ కంపెనీ పేరు తరచూ వినిపించేది. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ.. కీలక ప్రాజెక్టుల్లో మెగా పేరు తెరపైకి వచ్చేది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వైఎస్ హయాంలో వెలిగిపోయిన ఈ సంస్థ.. విభజన తర్వాత అటు ఏపీ.. ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు చేజిక్కించుకోవటం విశేషం.

పవర్ లో ఎవరున్నా.. పనులు మాత్రమే తమకేనన్నట్లుగా ఉండటం మెగాకు మాత్రమే చెల్లిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి..రికార్డు సమయంలో పూర్తి చేయాలన్న తలంపులో ఉన్న పట్టిసీమ ప్రాజెక్టును సైతం మెగా సంస్థే చేపట్టటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వైఎస్ కు అత్యంత సన్నిహితులన్న ముద్ర ఉన్న ఈ కంపెనీ.. బాబు హయాంలో పట్టిసీమ ప్రాజెక్టును చేజిక్కించుకున్న తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత.. విపక్ష నేత వైఎస్ జగన్ మెగా సంస్థపై పలు విమర్శలు చేశారు. పట్టిసీమలో భారీగా నిధులు చేతులు మారినట్లుగా ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. అటు ఏపీతో పాటు.. ఇటు తెలంగాణలోనూ ఈ సంస్థ పలు ప్రాజెక్టుల్ని చేజిక్కించుకోవటం చూస్తుంటే.. రెండు రాష్ట్రాల్లోనూ మెగా పంట పండిపోతుందని చెప్పక తప్పదు.