Begin typing your search above and press return to search.

నిన్న చిరంజీవి.. నేడు నాగబాబు... పవన్ కోసమే..!

By:  Tupaki Desk   |   12 Jan 2023 7:07 PM IST
నిన్న చిరంజీవి.. నేడు నాగబాబు... పవన్ కోసమే..!
X
పవన్ మా వాడు మా తమ్ముడు ఆయన కోసమే మేము అని మెగా బ్రదర్స్ మాట్లాడుతున్నారు. పవన్ రాజకీయంగా అభివృద్ధి చెందాలి ముందుకు సాగాలి, ఆయన అధికారంలోకి రావాలని అన్నయ్యలు మనసారా దీవిస్తున్నారు. కానీ తాము మాత్రం పరిమితులు పరిధిలు విధించుకుని అలా ఉండిపోతున్నారు. నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి అయితే తాను ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తిగా లేనని చెప్పేశారు.  తనకు రాజకీయ ఆసక్తులు కూడా లేవని సప్ష్టం చేశారు.

తన ఇంట్లో ఎవరైనా రాజకీయాల్లో ఉండవచ్చు. ఎవరి ఇష్టం వారిది అని ఆయన పవన్ గురించి చెప్పుకొచ్చారు. పవన్ రాజకీయంగా బాగా ఉండాలని విజయవంతం కావాలని కోరుకుంటాను అని మెగాస్టార్ చెబుతూనే తాను మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించేది లేదని క్లారిటీ ఇచ్చారు. తన ఆశ శ్వాస అన్నీ సినిమాలే అని ఆయన అంటున్నారు.

ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే అన్న చిరంజీవిలా రాజకీయాల మీద విరక్తి పెంచుకోలేదు కానీ పదవులు మాత్రం వద్దు అనేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరిగిన యువశక్తి సభలో నాగబాబు మాట్లాడుతూ జనసేన కుటుంబ పార్టీ కాదు అన్నది అంతా గుర్తుంచుకోవాలని అన్నారు. తాను పవన్ కి సోదరుడినే కానీ తాను జనసేన పార్టీ వరకే పరిమితం అవుతాను తప్ప అధికారంలో భాగం కాను, ఏ రకమైన పదవులూ కోరుకోను అని తెగేసి చెప్పారు.

జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకు అధికారం దక్కితే చాలు తాను దూరంగానే ఉంటాను పార్టీ కోసం జనసేన కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాను అని నాగబాబు సైతం క్లారిటీగా చెప్పేశారు. అందువల్ల కుటుంబ పార్టీ జనసేన అని ఎక్కడా ఎవరూ అడిగేందుకు అనేందుకు ఆస్కారం లేకుండా నాగబాబు ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.

ఇదిలా ఉంటే విశాఖ లోక్ సభ నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతున్న దశలో ఆ జిల్లాకు పక్కనే నిరహిస్తున్న జనసేన సభలో నాగబాబు తన మనోగతాన్ని వెల్లడించడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తన సోదరుడు నాగబాబుని ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు అని ప్రచారం జరిగింది.

అయితే నాగబాబు ఎన్నికల రాజకీయాల మీద మొదటి నుంచి ఎందుకో విరక్తిగానే ఉన్నారు. ఆయన 2019లో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి పెద్ద ఎత్తున ఓట్లు కొల్లగొట్టారు. కానీ ఆయన ఆ తరువాత సైలెంట్ అయ్యారు. జనసేనలో మాత్రం పనిచేస్తూ వస్తున్నారు.

ఇపుడు ఏకంగా స్టేజి మీదనే తాను పదవులు ఏవీ కోరుకోవడం లేదు అని చెప్పడం ద్వారా పవన్ మాత్రమే తమ ఫ్యామిలీ నుంచి ముందుంటారు అని అంటున్నారు. మొత్తానికి అన్నలు ఇద్దరూ పవన్ని దీవిస్తున్నారు. తాము మాత్రం దూరంగానే ఉంటామని అంటున్నారు. ఇద్దరు అన్నయ్యల బలమైన ఆశీస్సులు పవన్ కి నిండుగా దక్కి ఆయన ఏపీకి చీఫ్ మినిస్టర్ అవుతారు అని జనసైనికులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.