Begin typing your search above and press return to search.

టీడీపీపై ‘అనంత’ సమావేశం ఎఫెక్టు

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:54 AM GMT
టీడీపీపై ‘అనంత’ సమావేశం ఎఫెక్టు
X
తెలుగుదేశం పార్టీ అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ సమావేశం ఎఫెక్టు పడుతుందా ? అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలను రోడ్లపైకి తీసుకొచ్చేందుకునే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం ప్రకారం సదస్సులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే మొదటగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులపై చర్చ పేరుతో అనంతపురంలో సమావేశం జరిగింది.

సరే సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు ? చేసిన డిమాండ్లు ఏమిటి ? అన్న విషయాలు పక్కనపెట్టేస్తే జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్లే హాట్ టాపిక్ అయిపోయాయి. నిజానికి సమావేశంలో నేతలు ఆందోళన వ్యక్తంచేసిన హంద్రీ-నీవా ప్రాజెక్టు, గాలేరు-నగిరి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబునాయుడు చేసింది పెద్దగా లేదనే చెప్పాలి. ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టుల అంచన వ్యయాలు పెంచుకోవటం తప్ప ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు చేసిందేమీ లేదని మిత్రపక్షంగా ఉన్నపుడే బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

అధికారంలో ఉండగా చేయాల్సింది చేయకుండా ప్రతిపక్షంలోకి రాగానే హఠాత్తుగా రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతలు ఆందోళన చేయటమే పెద్ద జోక్ గా మారిపోయింది. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ ఓటమి ఖాయమంటు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపింది. పైకి చెప్పకపోయినా చాలామంది నేతల్లో ఇదే అభిప్రాయం ఉందనేది తాజా సమాచారం.

మరి అనంతపురంలో నిర్వహించిన సమావేశం లాంటిదే ఉత్తరాంధ్ర, కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహించేందుకు నేతలు వెనకాడుతున్నారట. నేతలతో ఎక్కడ సమావేశం నిర్వహించినా ఎవరో ఒకరు వాస్తవాలు బహిరంగంగా మాట్లాడినా ఆపే పరిస్ధితి లేదు. దాంతో పోయేది పార్టీ పరువే అన్నట్లుగా నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సమావేశం నిర్వహించటం ద్వారా ప్రభుత్వాన్ని ఏదో చేద్దామని అనుకుంటే చివరకు అది పార్టీకే రివర్సు తగులుతుందని ఎవరు ఊహించలేదు.

అనంత సమావేశంలో జేసీ వ్యాఖ్యల నేపధ్యంలో ఇతర ప్రాంతాల్లో సమావేశాలు పెట్టడానికే నేతలు వెనకాడుతున్నారట. పైగా తాను చెప్పాల్సిందంతా చెప్పేసిన జేసీ అవన్నీ చంద్రబాబుని ఉద్దేశించే చేయటంతో అధినేత కూడా ఇబ్బందుల్లో పడ్డారు. జేసీ వ్యాఖ్యలను ఖండిచలేక అలాగని నిజమే అని అంగీకరించలేక చంద్రబాబు అండ్ కో నానా అవస్తలు పడుతున్నారు. దీనిపైన రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఎక్కడా నోరిప్పక పోవటానికి కూడా ఇదే కారణమట.