Begin typing your search above and press return to search.

సాదాసీదా కుర్రాడు ఇప్పుడు సెల‌బ్రిటీ అయ్యాడు..!

By:  Tupaki Desk   |   6 Jun 2019 5:57 AM GMT
సాదాసీదా కుర్రాడు ఇప్పుడు సెల‌బ్రిటీ అయ్యాడు..!
X
అనారోగ్యానికి గురైతే ఆసుప‌త్రికి వెళ్లాల్సిందే. చికిత్స చేయించుకోవాల్సిందే. కానీ.. ఇప్పుడు చెప్ప‌బోయే కుర్రాడు కాస్త భిన్నం. ఆసుప‌త్రికి వెళ్ల‌ట‌మే కాదు.. సెల‌బ్రిటీగా మారిపోయాడు. న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో ఉన్న ఈ టీనేజ‌ర్ ఉదంతం ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటుంది.

ఉత్త‌రాఖండ్ కు చెందిన మోహ‌న్ సింగ్ అంద‌రు టీనేజ‌ర్ల లాంటి కుర్రాడే. ప్ర‌త్యేక‌త అంటూ ఏమీ లేదు. కాకుంటే మిగిలిన వారి కంటే భిన్నంగా ఎత్తుగా ఉంటాడు. త‌న తోటి కుర్రాళ్ల‌కు ఏ మాత్రం సూట్ కాని హైట్ ఇత‌గాడి సొంతం. ప్ర‌స్తుతం 16 ఏళ్ల మోహ‌న్ సింగ్ ఎత్తు ఎంతో తెలుసా? అక్ష‌రాల 7 అడుగుల 4 అంగుళాలు.

బాహుబ‌లి సైజ్ అన్న మాట‌. ఎత్తుకు త‌గ్గ‌ట్లే కుర్రాడు 113 కేజీల బ‌రువుతో ఉంటాడు. చిన్న‌త‌నంలో ఈ కుర్రాడి హైట్ అంత‌కంత‌కూ పెరిగిపోతుంటే.. అత‌నితో క‌లిసి అంద‌రూ ఫోటోలు తీసుకునే వారు. ముచ్చ‌ట‌గా అనిపించిన‌ప్ప‌టికీ రానున్న ఇదే పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఎత్తు పెరుగుతున్న కొద్దీ స‌మ‌స్య‌ల తీవ్ర‌త పెరుగుతోంది. ఇప్పుడు అత‌గాడి కోసం ప్ర‌త్యేకంగా మంచం.. బూట్లు.. బ‌ట్ట‌లు త‌యారు చేయించ‌టం త‌ప్ప‌నిస‌రైంది.

ఇదిలా ఉంటే.. ఐదు నెల‌ల క్రితం అత‌గాడికి ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌టంతో ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. అత‌డ్ని ప‌రీక్షించిన వైద్యులు.. అత‌నికి పిట్యూట‌రీ గ్రంథిలో క‌ణితి ఉన్న‌ట్లు తేల్చారు. ఈ గ్రంథి ఎక్కువ‌గా విడుద‌ల కావ‌టంతో శారీర‌కంగా వృద్ధి చెందుతున్న విష‌యాన్ని గుర్తించారు. అత‌డికి ఆప‌రేష‌న్ చేసి క‌ణితిని తొల‌గించారు. బ‌రువు ప‌రంగా అత‌డు కంట్రోల్ అయినా.. ఎత్తు పెరిగే విష‌యంలో మాత్రం బ్రేకులు ప‌డ‌లేదు.

ఈ గ్రంథిలో ఏర్ప‌డే స‌మ‌స్య‌లే హైట్ పెర‌గ‌టానికి కార‌ణమ‌న్న విష‌యం ఇప్ప‌టికై స్ప‌ష్టమైంది. ఈ గ్రంథిలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్ టైన్ మెంట్ స్టార్ గ్రేట్ ఖ‌లీ.. ప్ర‌పంచంలోనే పొడ‌వైన వ్య‌క్తిగా గిన్నిస్ రికార్డు అందుకున్న సుల్తాన్ కోసెస్ (8 అడుగుల 3 అంగుళాలు) ఎత్తుగా మార‌టానికి కార‌ణంగా తేలింది. తాజాగా మోహ‌న్ సింగ్ కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. సాదాసీదా కుర్రాడు సెల‌బ్రిటీల‌తో పోలిక తెచ్చేయ‌టం బాగానే ఉన్నా.. అంత‌కంత‌కూ పెరుగుతున్న హైట్.. ప్రాక్టిక‌ల్ గా ఎన్నో స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా మారుతోంది.