వైద్య విద్యార్థిని సూసైడ్ కేసులో అతడికి 10ఏళ్లు జైలు... తేల్చిన కోర్టు

Wed May 25 2022 10:22:17 GMT+0530 (IST)

medical student vismaya murder case news update

కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైద్య విద్యార్థిని విస్మయ ఆత్మహత్య ఉదంతంలో ఆమె భర్త కిరణ్ కుమార్ కు న్యాయస్థానం కఠిన శిక్షను వెలువరిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది. అంతేకాదు.. భారీ జరిమానాను విధించింది. అదనపు కట్నం కోసం భార్య ఆత్మహత్యకు కారణమయ్యేలా చేసిన అతడి భర్తకు తగిన శాస్తి అయ్యేలా చేసింది కొల్లం కోర్టు.న్యాయస్థానానికి చెల్లించే ఫైన్ లో రెండు లక్షల రూపాయిల్ని మాత్రం విస్మయ తల్లిదండ్రులకు ఇవ్వాలని స్పష్టం చేసింది.గత ఏడాది కేరళకు చెందిన ఆయుర్వేద వైద్య విద్యార్థిని అదనపు కట్నం కోసం తన భర్త తనను పెడుతున్న వేధింపుల గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం.. అది కాస్తా వైరల్ కావటం.. తర్వాతి రోజు ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం అందరిని షాక్ కు గురి చేసింది. ఆమె అర్థాంతర మరణానికి కారణమైన విస్మయ భర్తను ఊరికే వదిలిపెట్టకూడదని.. కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ భారీగా తెర మీదకు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది. కోర్టు విధించిన శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని స్పష్టం చేసింది. ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ తన కోర్సు పూర్తి చేయకముందే.. ఆమె తల్లిదండ్రులు ఆమెకు 2019 మే 19న పెళ్లి చేశారు. భర్త అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఆయనకు కట్నంగా 100 సవర్ల బంగారం.. ఎకరం భూమితో పాటు.. రూ.10లక్షలు విలువైన కారును బహుమతిగా ఇచ్చారు.

అయితే విస్మయ తల్లిదండ్రులు ఇచ్చిన కారు నచ్చలేదని.. తనకు మరో రూ.10లక్షలు ఇవ్వాలన్న దారుణ డిమాండ్ తో పాటు.. విస్మయను తీవ్రంగా చిత్ర హింసలకు గురి చేసేవాడని ఆమె తల్లిదండ్రులు పేర్కొనేవారు. ఈ క్రమంలో 2021 జూన్ 20న విస్మయ తన బంధువులకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపింది.  అదనపు కట్నం కోసం తన భర్త తనను ఎంతలా వేధిస్తున్నారన్న విషయాన్ని వెల్లడిస్తూ.. భర్త కొట్టిన కారణంగా శరీరానికి అయిన గాయాల ఫోటోల్ని పంపింది. ఆ తర్వాతి రోజు ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా మారింది.

ఆమె ఫోటోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారాయి. ఈ ఉదంతం కేరళ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దీంతో స్పందించిన ప్రభుత్వం.. ఈ కేసు మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. లోతైన దర్యాప్తు అనంతరం విస్మయ ఆత్మహత్య వరకట్నం కోసం వేధింపులు జరిపినట్లుగా గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై 500 పేజీలకు పైనే చార్జిషీట్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కిరణ్ కుమార్ ను దోషిగా తేల్చింది. పదేళ్లు జైలు.. రూ.12.55 లక్షల జరిమానాను విధిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.