Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ను ఆపేందుకేనా.. ఈ ఎర‌!

By:  Tupaki Desk   |   12 Nov 2021 1:30 AM GMT
హ‌రీశ్‌ను ఆపేందుకేనా.. ఈ ఎర‌!
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను త‌న మేన‌ళ్లుడు హ‌రీశ్‌ రావుకు సీఎం కేసీఆర్ అప్ప‌గించారు. కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం హ‌రీశ్‌ తీవ్రంగానే ప్ర‌య‌త్నించారు. కానీ ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో పార్టీ నిరాశ‌లో కూరుకుపోయింది. త‌న‌పై పెట్టిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోని హ‌రీశ్ రావుకు పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ అనూహ్యంగా ఆయ‌న‌కు కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మైన ఆర్థిక శాఖ బాధ్య‌త‌లు చూసుకుంటున్న హ‌రీశ్‌కు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ‌ను అప్ప‌గించ‌డంపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది.

భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రివ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో అప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చూసిన వైద్య ఆరోగ్య శాఖ ఖాళీ అయింది. అప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌రే ఆ శాఖ ఉంది. మ‌ధ్య‌లో హ‌రీశ్ స‌మీక్ష‌లు చేసిన‌ప్ప‌టికీ కేసీఆర్ ఆ శాఖ‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నారు. ఆ త‌ర్వాత ఈట‌ల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి బీజేపీ త‌ర‌పున హుజూరాబాద్‌లో పోటీ చేసి గెలిచారు. అక్క‌డ ఈట‌ల‌ను ఓడించాల‌నే కేసీఆర్ విసిర‌న బాణం హ‌రీశ్ విఫ‌ల‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్‌కు వైద్య ఆరోగ్య శాఖ‌ను కేటాయించ‌డం వెన‌క ఏదో ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. హ‌రీశ్‌ను బీజేపీ వైపు వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాల్లో ఇది భాగ‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దుబ్బాక‌లోనూ హ‌రీశ్ సార‌థ్యంలో ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీఆర్ఎస్ ఓట‌మి పాలైంది. అక్క‌డా బీజేపీ త‌ర‌పున ర‌ఘునంద‌న్ రావు గెలిచారు. హుజూరాబాద్‌లోనూ బీజేపీ నుంచి పోటీ చేసిన ఈట‌ల నెగ్గారు. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునే దిశ‌గా బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అందుకే టీఆర్ఎస్ నుంచి త‌మ పార్టీలోకి చేరే ఎమ్మెల్యేల‌పై ఓ క‌న్నేసింది. క‌నీసం అయిదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే టీఆర్ఎస్ అది గ‌ట్టి దెబ్బ అవుతుంది. గ‌తంలోనూ హ‌రీశ్ బీజేపీలో చేర‌తార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ వాటిని ఖండించిన హ‌రీశ్‌.. టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతాన‌ని అప్పుడు స్ప‌ష్టం చేశారు.

కానీ ఆ త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌రీశ్‌కు వెంట‌నే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఆయ‌న‌కు పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గుతున్న‌ట్లు అంద‌రూ భావించారు. అందుకే హ‌రీశ్ బీజేపీ వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం సాగింది. కానీ కేసీఆర్ ఆయ‌న్ని ఆర్థిక మంత్రిని చేశారు. ఇప్పుడు హ‌రీశ్ క‌న్ను మ‌ళ్లీ బీజేపీపై పడుతుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో హ‌రీశ్ పార్టీని గెలిపించ‌న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు మాత్రం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ‌ను కేసీఆర్ క‌ట్ట‌బెట్టారని విశ్లేష‌కులు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగేలా హ‌రీశ్‌ను అడ్డుకునే వ్య‌హ‌మే ఇది అని నిపుణులు అంటున్నారు.