Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలోనూ ఏపీ కంటే తెలంగాణ‌నే చౌక‌!

By:  Tupaki Desk   |   2 Dec 2017 10:40 AM IST
ఆ విష‌యంలోనూ ఏపీ కంటే తెలంగాణ‌నే చౌక‌!
X
మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెట్టేద్దాం. మ‌నిషి బ‌త‌కానికి అవ‌స‌ర‌మైన వైద్య‌సేవ‌ల‌కు సంబంధించి తాజాగా విడుద‌లైన నివేదిక దేశంలో స‌గ‌టుజీవికి ఎంత క‌ష్టంగా ఉంద‌న్న విష‌యాన్ని చెప్పేస్తుంది. దేశం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి చూసిన‌ప్పుడు.. వైద్య సేవ‌ల‌కు సంబంధించిన ఖ‌ర్చులోనూ తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ‌న్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వైద్యం ఖ‌రీదైపోయింద‌ని.. స‌ర్కారు మాట‌లెన్ని చెప్పినా.. చివ‌ర‌కు చేతికి వ‌దిలే ఖ‌ర్చును ఆధారంగా చేసుకొని చూస్తే.. ఒక్కొక్కిరిపై ప‌డే భారం ఎంత‌న్న‌ది ఇట్టే తెలుస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుద‌ల చేసిన జాతీయ ఆరోగ్య వ్య‌య తాజా నివేదిక చూస్తే.. వైద్యానికి అయ్యే ఖ‌ర్చులు త‌ల‌కు మించిన భారంగా మారాయ‌న్న విష‌యాన్ని తేల్చింది.

ఆరోగ్య బీమా ఉన్నా.. ఏవో టెస్టుల పేరుతో బాదేసే మొత్తం బిల్లులో 20 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్లు తేలింది. అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌ల‌స‌రి అద‌న‌పుజేబు ఖ‌ర్చు తెలంగాణ‌లో రూ.2834 అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈ మొత్తం రూ.2901 ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుత ఆరోగ్య వ్య‌యం.. ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం.. నివార‌ణ చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక‌ను రూపొందించారు. స్థూల జాతీయోత్ప‌త్తిలో ఆరోగ్యం కోసం చేస్తున్న ఖ‌ర్చు కేవ‌లం 3.89 శాతం మాత్ర‌మే.

మొత్తం ఖ‌ర్చులో వైద్యంకోసం ప్ర‌భుత్వాలు చేస్తున్న ఖ‌ర్చు 29 శాతం కాగా.. అందులో కేంద్రం వాటా 37 శాతం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల వాటా 63 శాతంగా ఉంటోంది. అత్య‌ధిక వైద్య సేవ‌లు ప్రైవేట్‌.. కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో ఉండ‌టంతో ఖ‌ర్చు భారం అంత‌కంత‌కూ పెరుగుతోంది. జాతీయ‌స్థాయిలో త‌ల‌స‌రి ఏడాదికి రూ.2394 చొప్పున ఆరోగ్యం కోసం అద‌నంగా జేబుల్లో నుంచి ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని.. ఆరోగ్య వ్య‌యంలో ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం పెర‌గ‌టం ద్వారా ప్ర‌జ‌ల‌పై అద‌న‌పు భారం త‌గ్గుతుంద‌న్న సూచ‌న‌ను నిపుణులు చేస్తున్నారు.

2014-15 గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో మొత్తం ఆరోగ్య వ్య‌యం రూ.4.83 ల‌క్ష‌ల కోట్లు కాగా.. ప్ర‌భుత్వం ఆరోగ్యం మీద పెడుతున్న ఖర్చు రూ.1.39ల‌క్ష‌ల కోట్లు. ప్ర‌భుత్వం.. ప్ర‌భుత్వ ఖ‌ర్చును ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌లు సొంతంగా ఖ‌ర్చు చేస్తున్న‌ది రూ.3.02ల‌క్ష‌ల కోట్లు. 2014-15 ముందు మూడేళ్ల గ‌ణాంకాల్ని చూస్తే.. ఆరోగ్య బీమాపై చేసే ఖ‌ర్చు 1.6 శాతం ఉంచి 3.7 శాతానికి పెరిగిన‌ట్లుగా తేలింది. తెలంగాణ‌లో ఏటా వైద్యానికి పెట్టే ఖ‌ర్చు రూ.11,868 కోట్లు అయితే.. ప్ర‌భుత్వ వాటా ఇందులో కేవ‌లం 22.3 శాతం మాత్ర‌మే. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జ‌లు సొంతంగా వైద్యానికి పెడుతున్న అద‌న‌పు ఖ‌ర్చు రూ.7368 కోట్లుగా తేలింది.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. ఏటా వైద్యానికి అయ్యే మొత్తం ఖ‌ర్చు రూ.23.06 వేల కోట్లు కాగా.. ఇందులో ప్ర‌భుత్వ వాటా 15.4 శాతం. అంటే తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే.. దాదాపు ఏడు శాతం ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏపీలో ప్ర‌జ‌లు సొంతంగా వైద్యానికి అద‌నంగా ఖ‌ర్చు చేసే మొత్తం రూ.17,988 కోట్లుగా లెక్క తేల్చారు. అంటే.. తెలంగాణ‌తో పోలిస్తే ఏపీ ప్ర‌జ‌లు దాదాపు రూ.10వేల కోట్ల మేర అద‌నంగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా చెప్పాలి. ప్ర‌జ‌ల కోసం ఎలాంటి త్యాగాల‌కైనా సిద్ధ‌మ‌నే చంద్ర‌బాబు ఈ లెక్క‌ల్ని చూస్తే బాగుంటుందేమో?