Begin typing your search above and press return to search.

బూస్టర్ డోసులు ఎప్పుడో చెప్పిన వైద్య ప్రముఖుడు

By:  Tupaki Desk   |   24 Oct 2021 6:31 AM GMT
బూస్టర్ డోసులు ఎప్పుడో చెప్పిన వైద్య ప్రముఖుడు
X
కరోనా వచ్చింది. ప్రపంచానికి కొత్త కష్టాల్ని తీసుకొచ్చింది. కనివిని ఎరుగని రీతిలో యావత్ ప్రపంచం స్తంభించిన పరిస్థితి. అప్పటివరకు గంటకువంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేకు వేస్తే ఏమవుతుందో.. కరోనా పుణ్యమా అని ప్రపంచానికి అలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. మహమ్మారికి చెక్ చెప్పేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం తెలిసిందే. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లో మెరుగ్గా వంద కోట్ల డోసుల్ని అందించినట్లుగా మోడీ సర్కారు ఇటీవల ప్రకటించటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ సెప్టెంబరు.. అక్టోబరులో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉంటాయన్న వాదనకు భిన్నంగా కేసులు కనిష్ఠ స్థాయికి వచ్చేసిన పరిస్థితి. ఫర్లేదు.. కరోనా నుంచి బయటపడ్డామా? అన్న భావనకు వస్తున్న వేళలో.. ఈ వైరస్ పుట్టినిల్లు చైనాతో పాటు రష్యా.. అమెరికా.. బ్రిటన్ దేశాల్లో కేసులు మళ్లీ పుంజుకోవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం కొత్త సందేహాలకు గురవుతున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. బూస్టర్ డోసుల మీద చర్చ షురూ అయ్యింది. అసలు వేసుకోవాలా? వేసుకుంటే ఎప్పుడు వేసుకోవాలి? అన్నది పెద్ద ప్రశ్నగామారింది. ప్రస్తుతం రెండు డోసులు వేసుకున్న వారు మూడో డోసు వేసుకోవటానికి సరైన సమయం ఏమిటన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులు ప్రజల్ని మరణాల నుంచి.. ఆసుపత్రులకు పాలయ్యే అవకాశం నుంచి ఎంత కాలం కాపాడుతాయన్న దానికి తగ్గట్లు బూస్టర్ డోసు ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అమెరికా.. ఇజ్రాయెల్.. యూకే.. యూరోపియన్.. యూఏఈ తదితర దేశాల్లో బూస్టర్ డోసులను ఇప్పటికే రికమెండ్ చేశారుగా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. బూస్టర్ డోసు ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై నిర్దిష్ట సమాచారం లేదని.. కరోనాపై పోరాడే యాంటీబాడీలు చెప్పి బూస్టర్ డోసులు ఇవ్వలేమన్నారు. ఒక వ్యక్తి రెండో డోసు తీసుకొని ఎంతకాలమైందన్న దాన్ని చూడాలని.. మామూలుగా ఏడాది తర్వాత బూస్టర్ డోసుల గురించి ఆలోచించాలన్నారు.

యూకేలో కేసులు పెరుగుతున్నాయని.. ఆ దేశంలో గత డిసెంబరులో వ్యాక్సినేషన్ మొదలైందని గర్తు చేశారు. కేసులు పెరుగుతున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య.. మరణాల్లో పెరుగుదల లేకపోవటం చూస్తే.. గత ఏడాది వేసుకున్న వ్యాక్సిన్ ఇంకా పని చేస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. వైరస్ రూపాంతం చెంది బలపడితే కొంచెం వెనుకా ముందు బూస్టర్ డోసులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పిన ఆయన.. దేశంలో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలో షురూ అవుతుందని చెప్పారు. సో.. బూస్టర్ డోసు గురించి అట్టే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట.