Begin typing your search above and press return to search.

మీడియా దేశానికి ద్రోహం చేస్తుందా?

By:  Tupaki Desk   |   22 Aug 2020 1:30 AM GMT
మీడియా దేశానికి ద్రోహం చేస్తుందా?
X
ముద్రలు వేయటం చాలా తేలిక. ఒక వ్యూహంలో చిక్కుకొని.. విచక్షణ మరిచి.. అదే రందిలో కొట్టుకుపోవటం ఏ మాత్రం మంచిది కాదు. సామాన్యుడి విషయంలో ఇలాంటి తప్పులు జరిగితే సమాజానికి.. ఆ చుట్టూ ఉండే వారికి జరిగే నష్టంతో పోలిస్తే.. కీలక నేతలకు వేసే ముద్రల కారణంగా దేశానికి.. దేశ ప్రజలకు జరిగే నష్టం భారీగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కాంగ్రెస్ అన్నా..ఆ పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే గాంధీ ఫ్యామిలీ అన్నా దేశంలోని చాలామందికి.. ఇటీవల తరాలకు చాలా కోపమన్నది తెలిసిందే. రాజరికానికి కేరాఫ్ అడ్రస్ గా వారు మారారని.. స్వతంత్ర్య భారతంలో ప్రజాస్వామ్య రాజరికాన్ని వారు పెంచి పోషిస్తున్నట్లుగా ఫీలయ్యే వారు చాలామంది కనిపిస్తారు. విచిత్రం ఏమంటే.. ఇందిర హయాంలో వారసత్వ రాజకీయాల్ని పెంచి పోషించినప్పుడు.. రాజరికానికి ప్రతీకగా మారినప్పుడు దేశ ప్రజలు పెద్దగా ప్రశ్నించలేదు. ఇప్పుడా బంధనాల నుంచి బయటపడుతుంటే చేతకానితనంగా ముద్రలు వేయటం.. తనను తాను యువరాజుగా అనుకోవటానికి రాహుల్ పెద్దగా ఇష్టపడరని చెబుతారు.

తాము అధికారంలో ఉన్నప్పుడే తన కొడుక్కి పట్టాభిషేకం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న తపన.. ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొనటం.. రివ్యూలు చేయటం.. మంత్రులతో కలిసి ఎడెనిమిది గంటల పాటు భేటీలు నిర్వహించటం ఇలాంటివన్ని చూస్తున్నప్పుడు.. అవేమీ వారసత్వ రాజకీయాలుగా అనిపించవా?

తండ్రి అధికారంలో ఉంటే.. కొడుకుగా రాజకీయ వారసత్వం ఆస్తిగా రావాలనుకునే ధోరణి దేశంలో చాలామంది రాజకీయ నేతల కుటుంబాల్లో చూస్తుంటాం. ఆ లెక్కన చూసినప్పుడు పదేళ్ల యూపీఏ పాలనలో మన్మోహన్ ను తప్పించి.. రాహుల్ పగ్గాలు చేపడితే కాదనే వారెవరున్నారు? కానీ.. ఆ పని చేయనితనం రాహుల్ ను పప్పుగా.. చేతకానివాడిగా ముద్ర పడటం దేనికి నిదర్శనం? అధికారాన్ని ఏదోలా హస్తగతం చేసుకోవాలన్న తలంపు ఎంతవరకు మంచిది? అలా చేసిన వారిని శక్తివంతులుగా.. సమర్థులుగా అభివర్ణిస్తున్న మీడియా.. అందుకు భిన్నంగా ఉండే వారిని బలహీనులుగా కథనాలు రాయటం..కార్టూన్లు వేయటం దేనికి నిదర్శనం?

రాజరికం ఒకరి బ్యాక్ గ్రౌండ్ గా ఉండటం వారు చేసిన తప్పు కాదు కదా? తనకు తాను రాజరికాన్ని వద్దని భావించినా.. ఆ వ్యక్తి తీరును గుర్తించకుండా.. ‘పప్పు’ అంటూ అవహేళన చేయటం కొందరికి బాగానే ఉన్నా.. అలాంటివి వ్యవస్థలకు మంచిది కాదన్నది మర్చిపోకూడదు. ఒక ముఖ్యనేత మాటల్ని పెద్దగా పట్టించుకోని విచిత్ర వైఖరి ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. మీడియాను ప్రభావితం చేసేలా సోషల్ మీడియా బలోపేతం కావటం ఒక ఇబ్బందికర పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే.. సోషల్ మీడియాను ప్రభావితం చేయగలమన్న ఆరోపణలు ఇప్పుడు చాలా దేశాల్లో చూస్తున్నదే.

కరోనా ఎపిసోడ్ ను చూస్తే.. రాహుల్ గాంధీ తరచూ పలు వినతులు.. సలహాలు.. సూచనలు చేశారు. ఆయన చెప్పిన ఏ విషయాన్ని మీడియాతో సహా సీరియస్ గా తీసుకున్నది లేదు. తాను చేసిన సూచనలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దాన్ని నిశితంగా చూస్తే.. దేశం చేసే తప్పులు ఇట్టే కనిపిస్తాయి. కరోనా సంక్షోభ కాలంలో వచ్చే ప్రమాదాల్ని హెచ్చరించిన వైనం కనిపించటమే కాదు.. తాను ఆ విషయాల్ని చెబితే మీడియా తనను హేళన చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక జాతీయ స్థాయి నాయకుడి చెప్పిన మాటలు.. చేసిన సూచనల్ని అంత తక్కువ చేసి చూడటం సరైనదేనా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

పాజిటివ్ కేసులు ఎంతలా పెరుగుతాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే.. రాబోయే రోజుల్లో మరెన్ని పెరుగుతాయి? ఈ సందర్భంగా దేశంలో పెరిగే నిరుద్యోగిత.. బ్యాంకులు ఇచ్చే మారిటోరియం ముగిసిపోతే.. ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అన్న సందేహంతో పాటు.. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు కూడా తన ట్వీట్లలో ప్రస్తావించారు. అయితే.. ఇవేమీ ఎక్కడా ప్రముఖంగా కనిపించని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేది ఏమంటే.. ఒక కీలక నేతను.. ‘పప్పు’ అనే పేరు పెట్టి పక్కన పెట్టేయటం దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. రాజకీయాల్ని పక్కన పెడితే.. హంసలా ఉండాల్సిన మీడియా సైతం.. అందుకు భిన్నంగా వ్యవహరించటం ప్రజల్ని.. దేశానికి ద్రోహం చేసినట్లు కాదా?