Begin typing your search above and press return to search.

మీడియా రంగంపై కరోనా ఎఫెక్ట్...రాబోయేది గడ్డుకాలమే

By:  Tupaki Desk   |   28 July 2020 4:30 PM GMT
మీడియా రంగంపై కరోనా ఎఫెక్ట్...రాబోయేది గడ్డుకాలమే
X
అభివృద్ధిలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న అమెరికా వంటి అగ్రదేశాలు మొదలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న అనామక దేశాల వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఆ రంగం..ఈ రంగం అని తేడా లేకుండా దాదాపుగా అన్ని రంగాలపైనా కరోనా పంజా విసిరింది. 2008లో చవిచూసిన ఆర్థిక మాంద్యంతో పోలిస్తే....కరోనా దెబ్బకు రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఎన్ని ఏళ్లు ఉంటుందో కూడా చెప్పలేమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పటికే జీడీపీలో వృద్ధిలేక నానా తిప్పలు పడుతోన్న భారత ఆర్థిక వ్యవస్థను కరోనా కోలుకోలేని దెబ్బకొట్టిందని అంటున్నారు. మన దేశంలో మీడియా రంగంపై కరోనా ప్రభావం గణనీయంగానే పడింది. మీడియా రంగానికి ప్రధాన ఆదాయవనరైన ప్రకటనలు దాదాపుగా తగ్గిపోవడంతో చిన్న చితకా మాస పత్రికలు మొదలు....దిగ్గజ మీడియా సంస్థలూ ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ క్రమంలోనే చిన్నా చితకా పత్రికలు, చానెళ్లు మూత పడగా....పెద్ద పెద్ద మీడియా సంస్థలు పేజీల కుదింపు, ఉద్యోగుల తొలగింపు, ఉన్న కొద్ది మంది ఉద్యోగుల జీతాల్లో కోత వంటి కార్యక్రమాలతో బండి నడిపిస్తున్నాయి. అన్నిరంగాలతోపాటు మీడియాపైనా కరోనా ప్రభావం మరికొద్ది నెలలపాటు ఉండబోతోన్న నేపథ్యంలో తాజాగా మరిన్ని కోతలకు మీడియా సంస్థలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది.

ప్రముఖ మీడియా సంస్థ అయిన డెక్కన్ క్రానికల్ గ్రూపు తమ ఉద్యోగుల జీతాలలో 20 నుంచి 50 శాతం కోత విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి 2021 వరకు ఈ కోత విధించిన జీతాలను చెల్లించాలని యాజమాన్యం భావిస్తోందట. అయితే, ఈ అరకొర జీతం కూడా ప్రతి నెలా కచ్చితంగా చెల్లిస్తారో లేదో తెలియని పరిస్థితులున్నాయట. ఈ కోతల్లోనూ తెలంగాణ, ఏపీలను బట్టీ తేడాలున్నాయట. డెక్కన్ క్రానికల్ దినపత్రిక విశాఖపట్నం, విజయవాడ, చెన్నై ఎడిషన్ లో పనిచేసే ఉద్యోగులకు 30 శాతం కోతలుండగా, హైదరాబాద్ ఎడిషన్ లోన ఉద్యోగులకు 20 శాతం మాత్రమే కోత విధించనున్నారట. మిగతా ఎడిషన్లలోని ఉద్యోగులందరి జీతాల్లోనూ 50 శాతం కత్తెర వేయనున్నారట. ఇక, ఆంధ్రభూమి అన్ని ఎడిషన్లలోని ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోతలుంటాయట. అయితే, ఇది కేవలం డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమిలకే పరిమితం కాబోవడం లేదని తెలుస్తోంది. కరోనా గడ్డుకాలంలో మిగతా దినపత్రికలు, మీడియా చానెళ్లు కూడా ఇదే ఫార్ములాను నమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయని తెలుస్తోంది.