Begin typing your search above and press return to search.

సీఎం ప్రోగ్రాం క‌వ‌ర్ చేద్దామ‌ని వెళితే గ‌దిలో బంధించారు!

By:  Tupaki Desk   |   1 July 2019 8:34 AM GMT
సీఎం ప్రోగ్రాం క‌వ‌ర్ చేద్దామ‌ని వెళితే గ‌దిలో బంధించారు!
X
యోగి రాజ్య‌మా మ‌జాకానా? ఎక్క‌డైనా నోరెత్తొచ్చు. కొన్ని చోట్ల మాత్రం ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలంతే. పేరుకు ప్ర‌జాస్వామ్య‌మే కానీ న‌డిచేదంతా వ్య‌క్తిస్వామ్య‌మే. ప్ర‌జ‌లు ఎన్నుకొన్న ప్ర‌జాప్ర‌తినిధుల ఇష్టంతో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసినంత‌నే ప్రజానాయకుడిగా మారిపోరుగా? అందునా.. యోగి లాంటి వారికి అదే ప‌నిగా ప్ర‌శ్న‌లు అడిగే వారంటే ఒళ్లు మంట అట‌. అందుకే కాబోలు తాను క‌నిపిస్తే చాలు ప్ర‌శ్న‌లు అడిగే మీడియా ప్ర‌తినిధుల విష‌యంలో స‌రికొత్త ఐడియా వేసిన తీరు ఇప్పుడు క‌ల‌క‌లంగా మారింది.

ముఖ్య‌మంత్రి పాల్గొంటున్న కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చిన మీడియా ప్ర‌తినిధుల‌ను ఒక రూంలోకి తీసుకెళ్లి తాళం వేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అంతేకాదు.. ఆ గ‌ది ముందు భ‌ద్ర‌తాసిబ్బందిని ఉంచారు. సీఎంగారు వ‌చ్చి వెళ్లిన అర‌గంట త‌ర్వాత జిల్లా క‌లెక్ట‌ర్ స్వ‌యంగా వ‌చ్చిన తాళం తీసిన వైనం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ గా చెబుతున్నారు.

ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆదివారం మెరాదాబాద్ లోని ఒక ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న మీడియా ప్ర‌తినిధులు ఈ వార్త‌ను క‌వ‌ర్ చేయ‌టానికి ఆసుప‌త్రికి వెళ్లారు. అలా వెళ్లిన మీడియా ప్ర‌తినిధుల్ని ఎమ‌ర్జెన్సీరూంలో ఉంచేసి తాళం వేసేశారు. ఈ వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారింది. ప్ర‌భుత్వం తీరును ప్ర‌తిప‌క్షాలు త‌ప్పు ప‌డుతున్నాయి. ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోకుండా.. ప్ర‌శ్నించే విలేక‌రుల్ని బంధీలుగా చేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే.. స్వ‌యంగా వ‌చ్చి తాళం తీసిన జిల్లా క‌లెక్ట‌ర్ రాకేశ్ కుమార్ సింగ్ మాత్రం భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. జ‌ర్న‌లిస్టుల‌ను బంధించ‌లేద‌ని.. ఎక్కువ మంది ఉండ‌టంతో వార్డుల్లోకి వెళ్లొద్ద‌ని మాత్ర‌మే చెప్పామ‌ని చెబుతున్నారు. సీఎం ప్రోగ్రాం క‌వ‌రేజీకి వ‌స్తే ఇలా బంధించ‌టం ఏమిటంటూ విస్మ‌యానికి గురి అవుతున్నారు పాత్రికేయులు. చూస్తుంటే.. దేశంలోని త‌న సోద‌రు సీఎంల‌కు యోగి త‌న‌దైన శైలిలో కొత్త త‌ర‌హా ఐడియాను ఇస్తున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు?