Begin typing your search above and press return to search.

అత్యుత్సాహం తగలడ..మాజీ ఎంపీని చంపి బతికించారుగా?

By:  Tupaki Desk   |   21 Sept 2019 10:03 AM IST
అత్యుత్సాహం తగలడ..మాజీ ఎంపీని చంపి బతికించారుగా?
X
పోటీ ఉండటం తప్పు కాదు. కానీ.. భావోద్వేగాల్ని అస్సలు పట్టించుకోకుండా ఇష్టరాజ్యాంగా వ్యవహరిస్తున్న మీడియా.. సోషల్ మీడియా తీరు చూస్తే కడుపు మండిపోవటమే కాదు.. మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సెలబ్రిటీలు.. రాజకీయ రంగ ప్రముఖుల ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేకున్నా.. ఆ వెంటనే వారి చావు కబురు వేసే వరకూ నిద్రపోని మీడియా.. సోషల్ మీడియాలు ఇప్పుడు పోటీ పైశాచికత్వంతో చెలరేగిపోతున్నారు.

ఇప్పటికే పలువురు సినీ..రాజకీయ ప్రముఖుల విషయంలో జరిగిన దారుణమైన పొరపాటే తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ.. సీనియర్ టీడీపీ నేత కమ్ నటుడైన 71 ఏళ్ల డాక్టర్ ఎన్. శివప్రసాద్ విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఆయన ఆరోగ్యం బాగోలేదని.. కండిషన్ సీరియస్ గా ఉందంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కండిషన్ క్రిటికల్ గా ఉందన్న సమాచారం బయటకు వచ్చిన కాసేపటికి.. ఆయన మరణించినట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసినంతనే టీడీపీ అధినేత చంద్రబాబు హుటాహుటిన చెన్నైకి వెళ్లి ఆయన్ను.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో ఆయన మరణించినట్లుగా వార్తల్ని పుట్టించేశారు. ఒక్కసారిగా మరణించినట్లుగా బ్రేకింగులు వేసి.. ఆ వెంటనే తమ తప్పును సరిదిద్దుకొని కండిషన్ క్రిటికల్ గా ఉందంటూ మార్చేశారు.

ఇక.. సోషల్ మీడియాలో రచ్చ మరోలా మారింది. ఆయన మరణించారంటూ సంతాపాలు.. కన్నీళ్లు.. కామెంట్లతో కాసేపు మోత పుట్టించారు. ఒక ప్రముఖుడి మరణం విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన వారంతా.. వేగంగా సమాచారం అందించాలన్న ఆత్రుత అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ప్రముఖులకు కొత్త కష్టాన్ని తీసుకురావటమే కాదు.. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా చిత్రీకరిస్తున్న వైనం మరింత ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.