Begin typing your search above and press return to search.

మీడియాలో అనైక్యత పోయేదెన్నడు?

By:  Tupaki Desk   |   13 Sep 2019 12:33 PM GMT
మీడియాలో అనైక్యత పోయేదెన్నడు?
X
ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ ఎస్టేట్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చేది మీడియా. మారుతున్న సమాజ పరిణామ క్రమంలో ఒక్కోసారి మీడియా కట్టుబాట్లు తప్పుతోంద‌న్నది కూడా నిజం. అయితే ఒకరిద్దరు సంగతి ఎలా ఉన్నా మీడియాలో నిష్పక్షపాతమైన నిజాలు వెల్లడిస్తూ సమాజంలో మార్పు కోసం తమవంతుగా ప్రయత్నాలు చేసే సంస్థలు ఇప్పటికీ లేకపోలేదు. తెలుగులో ఇది కొరతే. ఇక రాజకీయాలకు.. మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండూ ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి. రాజకీయ పార్టీలు తప్పు చేస్తే ఎత్తి చూపించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. అయితే అదే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమ తప్పులు ఎత్తి చూపిన మీడియాను టార్గెట్ చేస్తూ ఉండటం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కామన్ అయిపోయింది.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలను టార్గెట్ చేయటం కామన్ అయిపోయింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ తమ ప్రాంత భాషను వక్రీకరిస్తూ.. తమ రాష్ట్ర ప్రజా ప్రతినిధులను అవమానిస్తూ కథనాలు ప్రసారం చేశారన్న ఆరోపణతో టీవీ 9 - ఏబిఎన్ ఛానల్స్ పై అసెంబ్లీ సాక్షిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలంగాణలో ఏబీఎన్ - టీవీ 9 ఛానల్ ప్రసారాలు బంద్ అయ్యాయి. కొద్దిరోజుల తర్వాత ఈ ఛానల్స్ ప్రసారాలు పునః ప్రారంభ‌మ‌య్యాయి.

ఇక ఏపీలో ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలోను తమ వ్యతిరేక మీడియాను టార్గెట్ చేశారు. టిడిపి ప్రభుత్వ పాలనలో సాక్షి ఛానెల్‌ తో పాటు ఎన్టీవీ ప్రసారాలను ఆపేశారు. కేవలం ఒక జర్నలిస్టు విషయంలో ఓ ఛానల్ ప్రసారాలు ఆపేలా అప్పటి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు మీడియా సంస్థపై ఒత్తిడి చేయటం అప్పట్లో మీడియా వర్గాల్లో తీవ్రమైన ఆందోళనకు కారణమైంది. అయితే... తొలుత రెండేళ్లు మీడియా కూడా చంద్రబాబును పెద్దగా విమర్శించలేదు. కొత్త రాష్ట్రం - కొత్త ప్రభుత్వం అని ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది. అయితే.. చంద్రబాబు తన హామీలను భారీగా తప్పుతుండటం - పార్టీ కార్యకర్తల కోసమే పథకాలు రచించడంతో కొన్ని మీడియాలు వీడియో సహితంగా వాటిని ప్రసారం చేశాయి. ఈ విమర్శలను చంద్రబాబు తట్టుకోలేక మీడియాపై పగబట్టారు. ఇక ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వం మారింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ అంటేనే ఎప్పుడూ వ్య‌తిరేకంగా ఉండే ఏబీఎన్‌ తో పాటు టీవీ 5 ఛానెల్స్ ప్ర‌భుత్వానికి ప్రభుత్వానికి కనీస సమయాన్ని ఇవ్వకుండా టార్గెట్‌గా చేసుకుని క‌థ‌నాలు వండేస్తున్నాయి. ప్రజాభిప్రాయం అని... చర్చలు అని... పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలాగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎందులో అయినా విఫలమైతే బాగుండు అన్నట్లు ఎల్లో మీడియా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ప్రజల నుంచే వచ్చాయి. దీంతో ఇదేం జర్నలిజం... ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వరా అంటూ ముఖ్యమంత్రి అధికారుల సమావేశంలో అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. అయినా...ఆ ఛానెల్స్ లో మార్పు రాలేదు. కొన్ని ఏరియాల్లో ఎమ్మెస్వోలు ఈ ఛానెల్స్ ప్ర‌సారాలు బంద్ చేస్తున్నారు. ఎల్లో మీడియా తన బాధ్యతను - విలువలను మరిచి ఇంతదాకా తెచ్చుకుందని జర్నలిస్టుల్లోనే కొన్ని వర్గాలు వ్యాఖ్యానించే పరిస్థితి.

మీడియా బ్యాన్ ఎంత తప్పో... ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన మీడియా... ఆ వ్యవస్థనే కించ పరిచేలా ప్రభుత్వాలను అస్థిరపరిచేలా బాధ్యతా రహితంగా వ్యవహరించడం కూడా అంతే తప్పు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఎంత గొప్ప నేత అయినా - పార్టీ అయినా ప్ర‌జాస్వామ్య విలువ‌లు - ప‌త్రికా విలువ‌లు గౌర‌వించాలి. రేపు వీళ్లు అద్భుతాలు చేస్తూ వీళ్ల‌ను హీరోలు చేసేది కూడా మ‌ళ్లీ అవే మీడియా సంస్థ‌లు. ఇక ఇలా మీడియాను కంట్రోల్ చేసే సంస్కృతికి చ‌ర‌మ‌గీతం పాడితే అంద‌రికి మంచిది.

అయితే, ఈ సమస్యకు కారణం మీడియా లోపమే అని చెప్పాలి. ఎందుకంటే... మీడియా సంస్థలు ఐక్యంగా లేవు. వారిలో అనైక్యత వల్ల అధికార కేంద్రాలకు సులువుగా టార్గెట్ అవుతున్నాయి. ఏ పార్టీ వైపు మొగ్గినా పర్లేదు గాని.. ఇతరులకు అన్యాయం జరిగినపుడు ఇతర మీడియా సంస్థలు మద్దతు పలికి ఉంటే... ఈరోజు వాటికి కూడా మద్దతు లభించేది. ఆనాటి స్వార్థమే ఈనాడు ముంచుతోంది. మీడియాలో అనైక్యత కొనసాగినంత కాలం... రాజకీయాలకు అవి బలవుతూనే ఉండక తప్పదు. అంటే ప్రభుత్వాల కంటే ముందు మారాల్సింది మీడియా. వాటి యాజమాన్యాలు. బాధ్యత విస్మరిస్తే... వాటికే కాదు, ప్రజాస్వామ్యానికి నష్టమే. అన్ని ప్రభుత్వాల పట్ల ఒకేలా మీడియా వ్యవహరిస్తే బాగుంటుంది.