Begin typing your search above and press return to search.

పత్రికలకు పండుగే ...పండుగ

By:  Tupaki Desk   |   6 Sept 2018 1:42 PM IST
పత్రికలకు పండుగే ...పండుగ
X
దేశంలో ఎన్నికలంటే అందరికీ పండుగే. రాజకీయ నాయకులకు పదవులు వస్తాయనే ఆశల పండుగ‌....... ప్రజలకు తామే తాత్కాలిక రాజులమనే ఆనందపు పండుగ......ఉద్యోగులకు వరాల జల్లు కురుస్తుందని పండుగ....నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని సంతోషపు పండుగ .......ఇక తాగుబోతులకు కడుపారా మందు దొరుకుతుందని నిషా పండుగ ..... వీరందరితో పాటు - పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనల పండుగ ... ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉండాల్సిన వాటికంటే చాలా ఎక్కువ మీడియా సంస్థలున్నాయి. దీంతో ప్రకటనల పోటీ తీవ్రమైంది. రాజకీయ మార్కెట్లో అన్ని పార్టీలు కేటాయించే ప్రకటనల బడ్జెట్ ను మీడియా సంస్థలన్నీ పంచుకోవాలి. దీంతో ప్రకటనల మజ్జిగ పలచబడి అందరికీ నీళ్ల మజ్జిగలాంటి ప్రకటనలే దక్కుతున్నాయి. తెలుగు ప్రజలలో పేరు - అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలు - రేటింగులున్న చానళ్లకు కాసింత గౌరవప్రదమైన ప్రకటనలే దక్కుతాయి. మిగిలిన మీడియా నుంచి మంచి కంటే చెడురాకుండ ఉండేందుకు రాజకీయ పార్టీలు - నాయకులు అరకొర ప్రకటనలు జారీ చేస్తారు. ఇలాంటి చిన్నాచితక పత్రికలు తెలుగు రాష్ట్రాలలో వందకు పైగానే ఉన్నాయని అంచన.

తెలంగాణలో సాధార‌ణ ఎన్నిక‌ల షెడ్యూల్ కు 9 నెలల ముందే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముందస్తు నగరా మోగిస్తోంది. దీంతో ఇక్కడ ఉన్న పత్రికలు - చానళ్లకు ప్రకటనల సీజన్ ప్రారంభమ‌వ‌బోతోంది. పత్రికలకు ప్రకటనలు గుప్పించడంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీల కంటే ముందుంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ కార్య‌క్రమాలపై పత్రికలకు జాకెట్ యాడ్ రూపంలో కోట్ల రూపాయలు వెచ్చించారు. ముందస్తు సమరానికి ప్రతీకగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు కూడా కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారు. దీంతో సంక్షోభంలో ఉన్న పత్రిక పరిశ్రమ కాసింత కుదుట పడిందని పరిశ్రమల వారంటున్నారు. ఇక ఇప్పుడు ముందస్తు కూడా రావడంతో పత్రికలకు, చాన‌ళ్లకు రాజకీయ పార్టీల నుంచి కోట్ల రూపాయల ప్రకటనలు వెలువడే అవకాశముంది. ఇది కాకుండా వ్యక్తిగతంగా వివిధ పార్టీల అభ్యర్థులు - వారి మద్దతుదారులు కూడా లక్షల రూపాయ‌ల విలువైన‌ ప్రకటనలు గుప్పించే అవకాశం ఉంది. ఇటీవల కొత్తగా వచ్చిన " పెయిడ్ ఆర్టికల్స్ " వల్ల కూడా పత్రికలకు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఎన్నికల పుణ‌్యమా అని వచ్చే రాబడితో తెలుగు పత్రికా రంగం ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.