Begin typing your search above and press return to search.

ఏపీ సెక్రటేరియట్ ‘మేధా’కు మారిపోతుందా?

By:  Tupaki Desk   |   24 Sept 2015 10:19 AM IST
ఏపీ సెక్రటేరియట్ ‘మేధా’కు మారిపోతుందా?
X
ఏపీ ప్రజల్ని ఏపీ నుంచే పాలించాలన్న పాలసీని పెట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని.. ఏపీ సచివాలయం సమూలంగా బెజవాడకు తరలించే కార్యక్రమం మరింత ఊపందుకొంది.

ఇప్పటికిప్పుడు ఏపీకి సచివాలయాన్ని మార్చేస్తే.. అక్కడ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అన్ని భవంతులు లేవు కదా? మౌలికసదుపాయాల మాటేమిటి? లాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకేఒక్క సమాధానంగా కనిపిస్తోంది మేధా టవర్స్.

దాదాపు 30 ఎకరాల్లో నిర్మించిన ఈ అధునాతన భవనం.. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఒక లాభించే అంశం. 2006లో నిర్మాణం చేపట్టి.. 2010 నాటికి పూర్తి చేసిన ఈ భవనంలో ఐటీ కంపెనీలకు ఇవ్వాలని భావించారు.

అయితే.. బెజవాడలో ఐటీ పరిశ్రమ పెద్ద ప్రోత్సాహకరంగా లేకపోవటంతో.. రెండు లక్షల చదరపు అడుగుల్లో ఉన్న ఈ భవనంలో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే కొలువు తీరిన పరిస్థితి. మేధా టవర్స్ లో 11 వేల మంది పని చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. ఇప్పుడు మాత్రం చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే పని చేస్తున్నారు.

మరోవైపు యుద్ధ ప్రాతిపదికన బెజవాడకు ఏపీ సెక్రటేరియట్ ను మార్చేయాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. భవనాల కొరతను మేధా టవర్స్ తీరుస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 2లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనంలో సెక్రటేరియట్ లోని అన్ని శాఖల్ని మూకుమ్మడిగా తరలించటమే కాదు.. ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

ఏపీ రాజధాని నిర్మాణం ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేనందున.. రాజధాని ప్రాంతంలో భవనాలు పూర్తి అయి.. వినియోగంలోకి వచ్చే వరకూ మేధా టవర్స్ నే ఏపీ సచివాలయంగా మార్చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

ఏపీ సచివాలయాన్ని డిసెంబరు నాటికి బెజవాడకు తరలించాలని భావిస్తున్నప్పటికీ.. మొత్తంగా మార్చటం విద్యా సంవత్సరం చివరి నాటికి పూర్తి కావొచ్చన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. భారీ భవనంతో పాటు.. విశాలమైన పార్కింగ్ సౌకర్యం.. విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో పాటు.. సమావేశాలకు.. మంత్రుల ఛాంబర్లకు సరిపోయేలా వసతి మేధా టవర్స్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ సచివాలయానికి అవసరమైన అన్నీ హంగులున్న మేధా టవర్స్ ను ఏపీ సర్కారు ఓకే చేస్తుందో లేదో చూడాలి.