Begin typing your search above and press return to search.

ఉద్యమిస్తారా... ఊరుకుంటారా...?

By:  Tupaki Desk   |   9 April 2015 10:59 AM GMT
ఉద్యమిస్తారా... ఊరుకుంటారా...?
X
ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్రాంతంలో ప్రముఖ సామాజికవేత్త మేథాపాట్కర్‌ పర్యటించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కుందని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. తుళ్లూరు మండలంలోని మూడు పంటలు పండే భూములను సిఆర్‌డిఎ చట్టం కింద తీసుకోవడం ఏమిటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్మదా బచావో వంటి ఉద్యమాలు... అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో కలిసి పోరాటం వంటివాటితో జాతీయ స్థాయిలో పేరున్న సామాజిక ఉద్యమకారిణైన ఆమె రాజధాని భూముల విషయంలో ఎంటరవడంతో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయన్నది చర్చనీయాంశమవుతోంది. ఆమె ఈ సమస్యపై ఉద్యమిస్తారా.... లేదంటే పిలిచారు కాబట్టి వచ్చాను అన్నట్లుగా చూసి వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద పొలాలను పరిశీలించిన మేధా అక్కడి భూములలో వందల రకాల పంటలు పండుతాయని, ఆ రైతులకు వ్యవసాయమే జీవనాధారమని చెబుతూ... వారికి అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో స్థానికంగా భూసమీకరణను వ్యతిరేకిస్తున్న వర్గాలు, నాయకులు ఆమెను ప్రభావితం చేస్తే దీన్ని ఆమె ఉద్యమంగా మలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే... ఇటీవలకాలంలో దేశంలోని ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఢిల్లీకే పరిమితం కావడం.. ఉద్యమాలను ప్రారంభించి వదిలేస్తుండడం... ఉద్యమకారులు కూడా కార్పొరీటకరణ చెందుతుండడంతో మేధాపాట్కర్‌ వచ్చినా చేసిందేమీ లేదన్న వాదనా వినిపిస్తోంది.