Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ.. ఫేమస్ అయిన మసాలా సంస్థల అధినేత ఇకలేరు

By:  Tupaki Desk   |   3 Dec 2020 12:15 PM IST
లాక్ డౌన్ వేళ.. ఫేమస్ అయిన మసాలా సంస్థల అధినేత ఇకలేరు
X
పెద్ద వ్యాపారంగా పట్టించుకోని మసాలాలకు ఉన్న మార్కెట్ మామూలుగా ఉండదు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే.. పెద్ద గ్లామర్ ఉండని ఈ బిజినెస్ కు.. గ్రామర్ ఎక్కువని వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. లాక్ డౌన్ పుణ్యమా అని.. హోటళ్లు.. రెస్టారెంట్లు అన్ని బంద్ అయిపోయి.. ఇళ్లే రెస్టారెంట్లుగా మారిపోవటం తెలిసిందే. ఈ సందర్భంగా వినూత్నమైన వంటల కోసం పెద్ద ఎత్తున మసాలాల్ని దేశ ప్రజలు వాడేశారు. దీంతో.. మసాలాల కంపెనీలు టీవీల్లో ప్రకటనలు భారీగా ఇవ్వటం కనిపిస్తుంది.

అలా ప్రజలకు సుపరిచితమైన మసాలా బ్రాండ్లలో ఎండీహెచ్ ఒకటి. తెల్లటి మీసాలు.. నవ్వుతూ కనిపించే తాతయ్యతో ఉండే అందరిని ఆకర్షించేది. నిజానికి ఎండీహెచ్ మసాలాలు దక్షిణాదితో పోలిస్తే.. ఉత్తరాదిలో బాగా ఫేమస్. ఆ కంపెనీ యజమాని మహాషై ధరంపాల్ గులాటి. 98 ఏళ్ల ఈ తాతయ్య ఈ రోజు (గురువారం) కన్నుమూశారు. దేశ రాజధాని ఢిల్లీలోని మాతాచానన్ దేవి హాస్పిటల్ లో కొద్ది వారాలుగా చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఈ రోజు తిరిగి రాని లోకాలకు పయమయ్యారు.

ధరం పాల్ గులాటీని.. దాదాజీగా.. మహాషైజీగా సుపరిచితుడు. ఆయన జీవితాన్ని చూస్తే.. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన స్వస్థలం ఇప్పటి పాకిస్తాన్ లోని సియోల్ కోట్. 1923లో పుట్టిన ఆయన.. దేశ విభజన నేపథ్యంలో భారత్ కు వచ్చేశారు. ఢిల్లీలోని కరోల్ భాగ్ లో ఒక షాపును ప్రారంభించారు. అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన.. దేశంలోనే ప్రముఖ మసాలా కంపెనీల్లో ఒకటి తన సంస్థను తయారు చేశారు. లాక్ డౌన్ వేళ.. దేశ ప్రజలకు టీవీ ప్రకటనల ద్వారా సుపరిచితమయ్యారు. మిగిలిన కంపెనీల మాదిరి గ్లామర్ చిందించే ప్రయత్నం చేయకుండా.. తమ సంస్థ పెద్దాయన్ను ప్రముఖంగా చూపించటంతో వీరి యాడ్ మిగిలిన వారికి భిన్నంగా నిలుస్తుంది.

మహాషై ధరంపాల్ గులాటి మరణంపై ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం ప్రకటించారు. ఆయనతో కలిసి ఫోటోల్ని షేర్ చేశారు. తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తిగా సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.