Begin typing your search above and press return to search.

ఆమె ఎంబీఏ-అతడు 7వ క్లాస్‌..రియల్‌ లవ్‌ స్టోరీ

By:  Tupaki Desk   |   1 Sept 2018 6:16 PM IST
ఆమె ఎంబీఏ-అతడు 7వ క్లాస్‌..రియల్‌ లవ్‌ స్టోరీ
X
ప్రేమ గుడ్డిది అంటారు - ఆ విషయం నిజమేనేమో అని కొన్ని ప్రేమ కథలు చూస్తుంటే - వింటుంటే అనిపిస్తూ ఉంటుంది. హైక్లాస్‌ అమ్మాయి - లోక్లాస్‌ అబ్బాయి ప్రేమలో పడటం సినిమాల్లో చూస్తూ ఉంటాం. రియల్‌ లైఫ్‌ లో అలాంటి ప్రేమ కథలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా హైదరాబాద్‌ లో ఒక ప్రేమ జంటను చూస్తే అచ్చు సూపర్‌ హిట్‌ లవ్‌ స్టోరీ సినిమాను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రేమ కథ మరెక్కడో కాదు హైదరాబాద్‌ లోనే జరిగింది. సినిమా కథను మించి ఉన్న ఈ ప్రేమ కథ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

పోలీసుల కథనం ప్రకారం ఎంబీఏ పూర్తి చేసిన 24 ఏళ్ల అమ్మాయి - కనీసం ఏడవ తరగతి కూడా పూర్తిగా చదవని 19 ఏళ్ల వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ తో ప్రేమలో పడిందట. ఉన్నత కుటుంబంకు చెందిన ఆమె - జీవించడమే భారంగా ఉన్న ఆ కుర్రాడు వయస్సు గురించి ఆలోచించకుండా చెట్టా పట్టాలేసుకుని తిరిగేశారు. అయిదు అంతస్తుల భవనం ఉన్న ఆమె ఇంటికి ఇతగాడు వాటర్‌ ట్యాంక్‌ తో వాటర్‌ ను సరఫరా చేసేవాడట. ఆ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడటం, నాలుగు నెలలు ప్రేమించుకుని ఇంట్లో చెప్పకుండా లేచి పోయి పెళ్లి చేసుకుని హఫీజ్‌ పేట్‌ లో కాపురం పెట్టారు.

అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు పెట్టడంతో పోలీసులు హఫీజ్‌ పేట్‌ లో వారిని పట్టుకున్నారు. పోలీసులకు ఆమె తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పిందట. అయితే అబ్బాయి వయస్సు 19 ఏళ్లు అవ్వడంతో మేజర్ కాదని అందుకే ఇద్దరిని ఎవరి ఇంటికి వారిని పంపేయడం జరిగింది. వీరిని పోలీసులు విడదీసినా కూడా వారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా తల్లిని బంజారాహిల్స్‌ లోని సెంచూరి హాస్పిటల్‌ కు తీసుకు వెళ్లిన ఆమె అక్కడకు అతడిని పిలిపించుకుని రెండు వారాల క్రితం పారిపోవడం జరిగింది.

పోలీసుల మళ్లీ వీరిని వెదికి పట్టుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారట. కాని అమ్మాయి మాత్రం తాము పెళ్లి చేసుకున్నాం - ఇంటికి వెళ్లను - అతడితోనే జీవితంను కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తమను విడదీసేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ హెచ్చరించిందట. దాంతో అతడు మేజర్ అయ్యే వరకు పునరావాస కేంద్రంలో ఉంచాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ ప్రేమ కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.